Let's talk: editor@tmv.in
హైడ్రాకు 'ఎన్ఆర్ఎస్‌‌సీ' డేటా వజ్రాయుధం: కమిషనర్ రంగనాథ్

హైడ్రాకు 'ఎన్ఆర్ఎస్‌‌సీ' డేటా వజ్రాయుధం: కమిషనర్ రంగనాథ్

Gaddamidi Naveen
14 మార్చి, 2026

చెరువులు, నాలాలు ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉపగ్రహ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) బఫర్ పరిమితులను ఖచ్చితంగా నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అందిస్తున్న ఉపగ్రహ ఆధారిత డేటా హైడ్రాకు “వజ్రాయుధం”లా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఎన్‌ఆర్‌ఎస్‌సీ కేంద్రంలో ‘వికసిత్ భారత్ -2047 సాధనలో భూమి పరిశీలన విధానాలు ధోరణులు, సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన యూజర్ మీట్‌లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చెరువులు, నాలాలు, వాటి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లకు సంబంధించిన సమాచారం వివిధ సంస్థల వద్ద భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఎస్‌సీ డేటా స్పష్టతనిచ్చే దిక్సూచిలా ఉపయోగపడుతోందని తెలిపారు.

ఈ డేటా ద్వారా చెరువుల అసలు సరిహద్దులను గుర్తించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాల పరిమితులను కూడా ఖచ్చితంగా గుర్తించగలుగుతున్నామని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి కూడా ఈ డేటా ఉపయోగపడుతోందని తెలిపారు. భూమి వినియోగం కాలక్రమేణా ఎలా మారిందో ఉపగ్రహ చిత్రాల ద్వారా చూపిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో హైడ్రా పనిచేస్తున్నదని, ఎన్‌ఆర్‌ఎస్‌సీ లెక్కల ప్రకారం అక్కడి చెరువుల్లో దాదాపు 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15 సంవత్సరాల్లో మిగిలిన చెరువులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెరువుల జాడను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు.

హైడ్రా చర్యలతో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేయడం లేదా నిర్మాణాలు చేపట్టడం గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ అందించిన 2006 డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డెమ్) డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ణయిస్తున్నామని, అవసరమైతే 1970, 1990ల కాలానికి చెందిన ఉపగ్రహ డేటాను కూడా వినియోగిస్తామని చెప్పారు. ఓఆర్‌ఆర్ పరిధిలో సుమారు 13,500 ఎకరాల ప్రభుత్వ, ప్రజా అవసరాల భూమిని కాపాడగలిగామని, దీని అంచనా విలువ దాదాపు రూ. 70,000 కోట్లుగా ఉంటుందని వెల్లడించారు.

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లోని చెరువుల నీటి నాణ్యతపై కూడా ఉపగ్రహ ఆధారిత అధ్యయనాలు చేపట్టేందుకు ఎన్‌ఆర్‌ఎస్‌సీ సహకరించాలని హైడ్రా కమిషనర్ కోరారు. ఈ అధ్యయనాలు కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడంలో, సరస్సుల పునరుద్ధరణ చర్యలకు శాస్త్రీయ ఆధారాలు అందించడంలో దోహదపడతాయని తెలిపారు.

'హైడ్రా-రక్ష' పోర్టల్ ప్రారంభం

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో “హైడ్రా-రక్ష” అనే పౌర కేంద్రిత పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఓఆర్‌ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్లాట్ కొనుగోలు చేసే ముందు అది చెరువు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉందా అనే విషయాన్ని కూడా ఈ పోర్టల్ ద్వారా పరిశీలించవచ్చు. జిల్లా, మండలం, గ్రామం లేదా భౌగోళిక సమన్వయాలు నమోదు చేస్తే సంబంధిత ప్రాంతం మ్యాప్‌లో జూమ్ అయ్యి ఎఫ్‌టీఎల్ సరిహద్దులు, బఫర్ జోన్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రారంభంలో కొద్ది వారాల పాటు ఈ పోర్టల్‌ను హైడ్రా అంతర్గత వినియోగానికి మాత్రమే ఉపయోగించి, అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ వర్చువల్‌గా పాల్గొని హైడ్రా చేపడుతున్న చర్యలను అభినందించారు. అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించి ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో హైడ్రా చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డా. ప్రకాష్ చౌహాన్, ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ సహా పలువురు శాస్త్రవేత్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.