
హైకోర్టు స్టే పై అప్పీల్ చేస్తాం: సీఎం సిద్ధరామయ్య
అనుమతి లేకుండా ప్రభుత్వ ప్రాంగణాల్లో 10 మందికి పైగా వ్యక్తులు పాల్గొనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) సమావేశాలు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై తాత్కాలిక స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య సమాచార ప్రతినిధులతో మాట్లాడుతూ ధార్వాడ బెంచ్ ప్రభుత్వం ఉత్తర్వుపై తాత్కాలిక స్టే ఇచ్చింది. ఈ ఆదేశంపై మేం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేస్తాం అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భవనాలు, పార్కులు, రోడ్లు, మైదానాలు వంటి ప్రాంగణాల్లో అనుమతి లేకుండా పది మందికంటే ఎక్కువ మందితో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ అక్టోబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును హుబ్బళ్లి కేంద్రంగా ఉన్న పునశ్ఠెన్ సేవా సంస్థ హైకోర్టులో సవాలు చేయగా, జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధార్వాడ బెంచ్ ఆ ఉత్తర్వుపై తాత్కాలిక స్టే విధించింది. కోర్టు తన ఆదేశంలో, ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) (మాట్లాడే స్వేచ్ఛ) ఆర్టికల్ 19(1)(బీ) (శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు)లను ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
బీజేపీ ఎమ్మెల్సీ, శాసన మండలి విపక్ష నేత చలవడి నారాయణస్వామి ఇది కర్ణాటక ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని విమర్శించారు. కాంగ్రెస్ ఈ తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వును కోర్టు నిలిపివేసిందని, ఇది పౌర హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయవాది మల్లికార్జున్ విలేకరులకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 17న జరగనుంది. ప్రస్తుతం హైకోర్టు స్టే కొనసాగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడానికి సిద్ధమవుతోంది.
