
హైకమాండ్ చెబితే డీకేనే సీఎం: సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాము కలిసే ఉన్నామని నిరూపించడానికి బ్రేక్ ఫాస్ట్ లు చేస్తూనే ఉన్నారు. అంతర్గత కలహాలు లేనట్లు తెలిపేందుకు, తద్వారా బీజేపీకి విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఇద్దరు అల్పాహారం కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కలిసి ఉన్నామని సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఈ భేటీలు చూసేవారికి కాంగ్రెస్ అధిష్టానం ‘యూనిటీ’ పరీక్ష పెట్టినట్లనిపిస్తోంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో రెండోసారి బ్రేక్‌ఫాస్ట్ భేటీ అనంతరం మంగళవారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ నాయకులు యూనిటీగా ఉన్నామని మరోసారి ధృవీకరించారు. కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పారు. కర్ణాటకలో సీఎం పదవి పై జరుగుతున్న ఆధిపత్య పోరాటం నేపథ్యంలో, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? అన్న ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. హైకమాండ్ చెప్పినప్పుడు కచ్చితంగా అవుతారని స్పష్టం చేశారు. ఈ భేటీ సీఎం సిద్ధరామయ్య తమ నివాసంలో డీకే శివకుమార్‌ను కలిసిన తర్వాత జరుగుతున్నది. మొదటి భేటీలో ఇడ్లీ-సాంబారు, ఉప్మా తిన్న తర్వాత, ఈసారి డీకే శివకుమార్ సిద్ధరామయ్యను తమ ఇంటికి ఆహ్వానించి సాంప్రదాయ నాటు చికెన్, ఇడ్లీలతో ఆతిథ్యం ఇచ్చారు.
హైకమాండ్ తో త్వరలోనే భేటీ
బెంగళూరులో జరిగిన విలేకరుల ఉమ్మడి సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి హైకమాండ్‌తో భేటీ కూడా త్వరలో జరగబోతోందని తెలిపారు. నేను, డీకే శివకుమార్ ఐక్యంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా కలిసి ప్రభుత్వాన్ని నడుపుతాం. మా ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉన్నారు. కలిసే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటాం. ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే ఆశయాన్ని పాటిస్తాం, కలిసి పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇద్దరం కలిసి పనిచేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తాం. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అసెంబ్లీ సమావేశాల గురించి చర్చించాం. డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం పెట్టాలని నిర్ణయించాం. రైతుల సమస్యలు, రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలు చర్చిస్తాం. హైకమాండ్ – ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గేలు తీసుకునే నిర్ణయాన్ని ఇద్దరం ఆమోదిస్తాం. వాళ్లు (హైకమాండ్) మమ్మల్ని ఢిల్లీకి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాం. రేపు కేసీ వేణుగోపాల్‌ను ఒక కార్యక్రమంలో కలుస్తున్నాను, అక్కడ ఇద్దరం ఉంటాం.
మేం కలిసే ఉన్నాం
ఎప్పట్నుంచో మేం కలిసే ఉన్నాం. రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయం ప్రకారమే పనిచేస్తాం. నేను అదే చెప్పాను. ముఖ్యమంత్రి తృణ ధాన్యాలు, చెరకు రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటనపై మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని చెప్పారు. నేను ఆయన (ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్) ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చాను. డీకే శివకుమార్ నా ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చారు, తర్వాత నన్ను తమ ఇంటికి బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌కు రమ్మని ఆహ్వానించారు. అందుకే ఈ రోజు వచ్చాను, బ్రేక్‌ఫాస్ట్ చేశాం. పార్టీ వ్యవహారాలు చర్చించాం. ముఖ్యంగా వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బీజేపీ, జేడీ(ఎస్) అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాయి. మేం తీసుకునే నిర్ణయాలను ఆ పార్టీలు వ్యతిరేకిస్తాయి.
డీకే శివకుమార్ కూడా రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను ధృవీకరించారు. ముఖ్యమంత్రిని నా నివాసంలో ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. కర్ణాటక అభివృద్ధి, ప్రజల ప్రగతి పట్ల మేం కట్టుబడి ఉన్నామని శివకుమార్ ఎక్స్ లో రాశారు. కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్, శివకుమార్ సోదరుడు మాజీ ఎంపీ డీకే సురేష్ కూడా ఈ బ్రేక్‌ఫాస్ట్ భేటీలో పాల్గొన్నారు. 2023లో జరిగిన అధికార భాగస్వామ్య ఒప్పందం నేపథ్యంలో సీఎం పదవి పై ఉన్న అంతర్గత విభేదాలు ఈ ఇద్దరు నాయకులు మరోసారి భేటీ అవ్వడానికి దారితీసింది. నవంబర్ 29న సిద్ధరామయ్య కావేరి నివాసంలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ భేటీ జరిగింది.
