Let's talk: editor@tmv.in
హేతుబ‌ద్ధతతోనే ర‌క్త స‌ర‌ఫ‌రా కొర‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చు

హేతుబ‌ద్ధతతోనే ర‌క్త స‌ర‌ఫ‌రా కొర‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చు

FL - YUGDR
8 అక్టోబర్, 2025

సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రక్త అవసరాన్ని తీర్చడం అంత సులభం కాద‌ని, ఇలాంటి పరిస్థితుల్లో “హేతుబద్ధ వినియోగం” అనేది ఒక జీవన విధానంగా మారాల‌ని, త‌ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రా కొర‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. మన దేశంలో ఏటా అవసరమైన రక్త పరిమాణం సుమారు 1.5 కోట్ల యూనిట్లు అంచ‌నా కాగా, దేశవ్యాప్తంగా 10 నుంచి 40 లక్షల యూనిట్ల కొరత ఉందని నివేదికలు చెబుతున్నాయ‌ని వివ‌రించారు. డబ్ల్యూ.హెచ్.వో. ప్ర‌మాణాల‌కు అనుగుణంగా జనాభాలో కనీసం 1 శాతం మంది రక్తదాతలుగా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని, దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 5.3 లక్షల యూనిట్లు అవసరం కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల యూనిట్లకు పైగా సేకరించ‌గ‌లిగామ‌ని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం స్థానిక రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో "రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం" అనే అంశంపై ఏర్పాటు చేసిన‌ రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ ప్రారంభోత్స‌వంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా రక్త వినియోగంలో శాస్త్రీయ దృక్పథం, మానవతా దృక్పథం రెండింటినీ సమన్వయం చేయాలని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. రక్తం జీవానికి ఆధారం, మన ఉనికికి ప్రాణాధారం అని అభివ‌ర్ణించారు. రక్తం, దాని ఉత్పత్తులను హేతుబద్ధంగా వినియోగించడం అంటే స‌రైన సమయంలో, సరైన వ్యక్తికి, సరైన రక్త భాగాన్ని అందించడ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా వంటి భాగాలుగా విభజించి, అవసరానుసారం మాత్రమే ఉపయోగించడం ద్వారా ఫలితాలను మెరుగుప‌ర‌చవ‌చ్చ‌ని హిత‌వు ప‌లికారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, క్లినికల్ అవసరాలు వంటి సందర్భాల్లో అవసరమైన ప్రతి ఒక్కరికీ ర‌క్తం, ర‌క్త ఉత్ప‌త్తుల‌ను సమయానుకూలంగా అందించటం, సమర్థవంతంగా వినియోగించడం మ‌న ముందున్న‌ లక్ష్యాల‌ని నొక్కి చెప్పారు. శస్త్రచికిత్సల ముందు రక్తహీనతను తగ్గించే చర్యలుగా ఐరన్ సప్లిమెంట్లు, ఎరిథ్రోప్రొటీన్ వంటివి రక్త మార్పిడికి ప్రత్యామ్నాయాలుగా ప్రోత్సహించాల‌ని హిత‌వు ప‌లికారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రక్త మార్పిడి జరగాల‌ని సూచించారు.

నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ నివేదిక‌ల‌ ప్ర‌కారం దేశవ్యాప్తంగా సురక్షితమైన, సమయానుకూలమైన రక్త సరఫరాలో ఇంకా సవాళ్లు ఉన్నాయ‌ని, రక్తదాతల అవగాహన, నిల్వ, పంపిణీ, హేతుబద్ధ వినియోగం ద్వారా సమగ్ర రక్త నిర్వహణను సాధించవచ్చ‌ని పేర్కొన్నారు. మన రాష్ట్రం ఈ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంద‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 394 ర‌క్త నిల్వ కేంద్రాలు ఉన్నాయ‌ని, ఈ-ర‌క్త కోష్, ఇత‌ర ఆధునిక విధానాల ద్వారా స‌మ‌ర్ధ వినియోగం పెరుగుతోంద‌ని వివ‌రించారు. స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య పెరుగుతోంద‌ని, రక్త బ్యాంకుల మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయ‌ని, డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థలు పారదర్శకతను తీసుకువస్తున్నాయ‌ని ఉద్ఘాటించారు. ర‌క్త నిల్వ‌లు, ఇత‌ర వివ‌రాల‌తో కూడిన జాబితాల‌ను ఆయా కేంద్రాల వ‌ద్ద ఉంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌న్నారు. సమష్టి కృషితో, రక్తదానం, రక్త వినియోగం, నిర్వహణలో భారతదేశం ఆదర్శంగా నిలిచేందుకు మనమంతా స‌మ‌ష్టి కృషి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. వివిధ ర‌కాల అపోహలు కార‌ణంగా 85 శాతం యువ‌త ర‌క్త‌దానం చేయ‌డానికి ఆస‌క్తి చూప‌టం లేదు. దీన్ని అధిగ‌మించి వారంతా స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. ఒక‌రు ర‌క్తదానం చేయ‌టం ద్వారా ముగ్గురు ప్రాణాల‌ను కాపాడ‌వ‌చ్చ‌ని హిత‌వు ప‌లికారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందిస్తాం

ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని ప‌రిణామాల‌పై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో మ‌రింత మెరుగైన రీతిలో వైద్య సేవ‌ల‌ను అందిస్తామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. నీటి కాలుష్యం ద్వారా వ్యాపి చెందే వ్యాధుల ప‌ట్ల ఇప్ప‌టికే అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని, డ్రైడేలు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు. కురుపాం ఘ‌ట‌న‌పై అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌ని చెప్పారు. బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

జాతీయ వ‌ర్క్ షాప్‌లో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డా. సునీత శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. మేగా ప్రవీణ్ ఖోబ్రగడే, ఎన్‌బీటీసీ డైరెక్టర్ డా. కృష‌ణ్ కుమార్, ఏపీ స్టేట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. కె. నీలకంఠ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ డా. బి. ప్రసన్న వివిధ అంశాల‌పై మాట్లాడారు. ర‌క్త‌, ర‌క్త ఉత్ప‌త్తుల వినియోగం స‌మ‌ర్ధంగా సాగాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం ఎన్‌బీటీసీ త్రైమాసిక న్యూస్ లెట‌ర్‌ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ వ‌ర్క్ షాప్‌లో డబ్ల్యూ.హెచ్.వో. ప్రతినిధి డా. మాధుర్ గుప్తా, ఆర్. గణపతిరావు, డా. శాంతా సింగ్, వివిధ రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యాధికారులు, ఇతర అధికారులు, వైద్య రంగ నిపుణులు పాల్గొన్నారు.

హేతుబ‌ద్ధతతోనే ర‌క్త స‌ర‌ఫ‌రా కొర‌త‌ను అధిగ‌మించ‌వ‌చ్చు - Tholi Paluku