
హేట్ స్పీచ్, రోహిత్ వేముల బిల్లులపై బీజేపీ నేత ఎన్వీ సుభాష్ విమర్శలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన 'హేట్ స్పీచ్' (ద్వేషపూరిత ప్రసంగాలు) బిల్లు, 'రోహిత్ వేముల చట్టం'పై రాష్ట్ర బీజేపీ నిప్పులు చెరిగింది. ఇవి కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.
రాష్ట్ర బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ బిల్లుల ఆవశ్యకతపై ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే దేశంలో ద్వేషపూరిత ప్రసంగాలు, అంటరానితనం, ఎస్సీ/ఎస్టీ వేధింపులను అరికట్టడానికి పటిష్టమైన చట్టాలు ఉన్నప్పుడు, కొత్తగా వీటిని తీసుకురావడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.హేట్ స్పీచ్ బిల్ నిజంగా న్యాయవ్యవస్థను బలోపేతం చేయడానికేనా, లేక ఎంపిక చేసిన వర్గాలపై చర్యలు తీసుకుంటూ విభిన్న అభిప్రాయాలను అణచివేయడానికేనా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ప్రతిపాదిత చట్టాల్లో స్పష్టత లోపాలు ఉన్నాయని, వాటి వెనుక దాగి ఉన్న ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చట్టం సమానంగా అమలు అవుతుందా? ముఖ్యంగా కాంగ్రెస్ మిత్రపక్షంగా భావించే ఏఐఎంఐఎం నేతలపై కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కొందరు నేతలు హిందూ విశ్వాసాలను అవమానించేలా మాట్లాడినా తగిన చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ చట్టం, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి 'కాపీ-పేస్ట్' అని సుభాష్ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇప్పటికే ఈ బిల్లులోని అస్పష్టమైన నిర్వచనాలు, కఠినమైన శిక్షలపై న్యాయ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. స్పష్టత లేని చట్టాలు న్యాయం చేయడానికి బదులు, వేధింపులకు సాధనాలుగా మారుతాయని ఆయన హెచ్చరించారు.
రోహిత్ వేముల కుల గుర్తింపుపై గతంలోనే అనేక వివాదాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చట్టాలు తేవడం సరికాదని బీజేపీ పేర్కొంది. వెంటనే ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకోవాలని లేదా వీటిని బహిరంగ చర్చకు, న్యాయపరమైన పరిశీలనకు ఉంచాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ శాశ్వతం కాదని, ప్రతిపక్షాలను అణచివేసేందుకు తెచ్చే నిరంకుశ చట్టాలు భవిష్యత్తులో వారికే ఇబ్బందిగా మారుతాయని సుభాష్ హెచ్చరించారు.
