Let's talk: editor@tmv.in
హెలిప్యాడ్ భూములపై ఆరోపణలు పచ్చి అబద్ధం: దొంతిరెడ్డి వేమారెడ్డి

హెలిప్యాడ్ భూములపై ఆరోపణలు పచ్చి అబద్ధం: దొంతిరెడ్డి వేమారెడ్డి

Panthagani Anusha
8 ఫిబ్రవరి, 2026

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కొట్టిపారేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం బురదజల్లే రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

రైల్వే భూమిని రైతు భూమిగా చిత్రీకరించడం దారుణం

సదరు హెలిప్యాడ్ స్థలం దశాబ్దాలుగా రైల్వే నియంత్రణలో ఉందని, అక్కడ ఏ రైతు సాగు చేసినట్లు ఆధారాలు లేవని వేమారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఈ భూమిని రైల్వే శాఖ ఈఐడీ ప్యారీ అనే ఎరువుల కంపెనీకి లీజుకు ఇచ్చిందని కంపెనీ మూతపడిన తర్వాత జరిగిన వేలంలో కూడా అది రైల్వే ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో నమోదై ఉందని వివరించారు. అక్కడ ఎప్పుడూ వ్యవసాయ కార్యకలాపాలు సాగలేదని ఆయన స్పష్టం చేశారు. రికార్డులను సాక్ష్యంగా చూపుతూ 2015లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆర్సీ నంబర్ 22/7 ప్రకారం సర్వే నంబర్ 223/226/C2లోని 10.04 ఎకరాల భూమి అప్పటి కలెక్టర్ ఆధీనంలోకి వచ్చిందని వేమారెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాకముందే అది ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు ఇప్పుడు రైతుల నుంచి లాక్కున్నామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని ఇది అత్యంత సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

నిబంధనల ప్రకారమే నిర్మాణం

ముఖ్యమంత్రి భద్రత ప్రయాణ అవసరాల దృష్ట్యా, ఏవియేషన్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగానే హెలిప్యాడ్‌ను నిర్మించామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో అవసరమైన అన్ని అనుమతులు పొందాకే నిర్మాణం చేపట్టామని ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగలేదని విభజన రాజకీయాలు మాని, ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాల అమలుపై దృష్టి పెట్టాలని రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపాలని వేమారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హెలిప్యాడ్ భూములపై ఆరోపణలు పచ్చి అబద్ధం: దొంతిరెడ్డి వేమారెడ్డి - Tholi Paluku