
హెచ్-1బీ వీసా లాటరీ ప్రక్రియ పూర్తి
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ ఐటీ నిపుణుల కలల వీసా 'హెచ్-1బీ' ఎంపిక ప్రక్రియ ముగిసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన వార్షిక కోటా 85,000 మంది లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) బుధవారం ప్రకటించింది. సాధారణ కోటాతో పాటు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారి కోసం కేటాయించిన అడ్వాన్స్‌డ్ డిగ్రీ కోటా లాటరీ ప్రక్రియ కూడా పూర్తయిందని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు, వారి తరఫున దరఖాస్తు చేసిన సంస్థలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు పేర్కొంది.
నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
హెచ్-1బీ క్యాప్ కింద ఎంపికైన అభ్యర్థుల తరఫున కంపెనీలు ఏప్రిల్ 1 (బుధవారం) నుండి పిటిషన్లను దాఖలు చేయడం ప్రారంభించాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ కనీసం 90 రోజుల పాటు కొనసాగుతుందని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. దరఖాస్తుదారులు ఫిబ్రవరి 27న విడుదల చేసిన సరికొత్త 'ఐ-129' ఫారమ్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఎంపిక నోటీసు కాపీని తప్పనిసరిగా జత చేయాలని సూచించింది. రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన పాస్‌పోర్ట్ వివరాలు, విద్యార్హతలు, వేతన స్థాయికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
వేతన ఆధారిత నమూనాకు ప్రాధాన్యం
ఈసారి ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీసాల కేటాయింపులో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు 'వేతన ఆధారిత నమూనా'ను అనుసరిస్తున్నారు. అంటే అత్యధిక వేతనం, ఎక్కువ నైపుణ్యం ఉన్న దరఖాస్తుదారులకే తొలి ప్రాధాన్యం లభిస్తుంది. దీనివల్ల కార్మిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వీసాల కేటాయింపు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
భారీగా పెరిగిన ఫీజులు
స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యంతో విదేశీ ఉద్యోగుల స్పాన్సర్‌షిప్‌పై అమెరికా ప్రభుత్వం భారీ ఫీజులను విధించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అమెరికా వెలుపల నుండి కార్మికులను తెచ్చుకునే సంస్థలు సుమారు 1,00,000 డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.90 లక్షల పైమాటే) వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఏటా 65,000 సాధారణ వీసాలు, మరో 20,000 మాస్టర్స్ కోటా వీసాలను కేటాయిస్తారు. భారతీయ ఐటీ నిపుణులు, వైద్యులు ఈ వీసాలను అత్యధికంగా పొందుతున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
