
హెచ్-1బీ వీసా దరఖాస్తులను తక్షణమే నిలిపివేయాలని టెక్సాస్ గవర్నర్ ఆదేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులపై అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు కొత్త హెచ్-1బీ వీసా పిటిషన్లను వెంటనే నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే ఈ సంస్థల్లో నియామక నిబంధనలను కఠినతరం చేయడం వల్ల భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిలుపుదల మే 2027 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికన్లకే ఉద్యోగాలు.. గవర్నర్ కఠిన నిర్ణయం
ఫెడరల్ హెచ్-1బీ వీసా కార్యక్రమంలో దుర్వినియోగం జరుగుతోందని, అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే ఉద్దేశంతో గవర్నర్ అబాట్ ఈ చర్యలు చేపట్టారు. టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ నుంచి ప్రత్యేకంగా రాతపూర్వక అనుమతి పొందితే తప్ప ఏ ప్రభుత్వ సంస్థ కూడా కొత్త వీసా పిటిషన్లు వేయడానికి వీల్లేదు. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న వీసాదారులు, వారి బాధ్యతలు, ఏ దేశానికి చెందిన వారనే పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు.
లక్ష డాలర్ల ఎంట్రీ ఫీజు భారం
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, కొత్తగా హెచ్-1బీ వీసాపై అమెరికాలోకి ప్రవేశించాలంటే 1,00,000 డాలర్లు (సుమారు 84 లక్షల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన గతేడాది సెప్టెంబర్ 21 తర్వాత దాఖలైన దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. ఈ భారీ ఫీజు భారతీయుల ప్రవేశానికి పెద్ద అడ్డంకిగా మారింది. సాధారణంగా అమెరికా ఇచ్చే హెచ్-1బీ వీసాల్లో సుమారు 71 శాతం భారతీయులకే దక్కుతుండటం గమనార్హం.
దిగ్గజ ఐటీ సంస్థలపై ప్రభావం
అమెరికాలో హెచ్-1బీ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకునే సంస్థల్లో అమెజాన్ మొదటి స్థానంలో ఉండగా, భారతీయ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో స్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారతీయ కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఈ వీసాలపై ఆధారపడుతున్నాయి. టెక్సాస్ ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న వందలాది మంది భారతీయ పరిశోధకులు, అధ్యాపకుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
విద్యార్థుల పెట్టుబడి.. వేల ఉద్యోగాల సృష్టి
భారతీయ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో వెన్నుముకగా ఉన్నారు. ఏటా సుమారు 2.7 లక్షల మంది విద్యార్థులు భారత్ నుంచి అమెరికా వెళ్తున్నారు. ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో వీరు ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్లు అక్కడ ఖర్చు చేస్తున్నారు. ఈ పెట్టుబడి ద్వారా అమెరికాలో సుమారు 93,000 ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
పరిశోధనలకు ఆటంకం
నైపుణ్యం కలిగిన నిపుణుల నియామకం మందగించడం వల్ల విద్యా పరిశోధనలు దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉన్నత విద్య, సాంకేతిక రంగాల్లో టెక్సాస్ తన పోటీతత్వాన్ని కోల్పోవచ్చని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిలుపుదల కారణంగా భవిష్యత్తులో భారతీయ నిపుణుల వలసలు తగ్గే అవకాశం ఉంది.
