Let's talk: editor@tmv.in
హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుపై భారత్ ఆందోళన

హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుపై భారత్ ఆందోళన

Shaik Mohammad Shaffee
27 డిసెంబర్, 2025

పెద్ద సంఖ్యలో భారతీయుల హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేసి నెలల పాటు వాయిదా వేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేశామని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.

ఈ నెల మధ్య నుంచి భారత్‌లో జరగాల్సిన వేలాది మంది హెచ్-1బీ వీసా అభ్యర్థుల ఇంటర్వ్యూలను అమెరికా వలస విభాగం అధికారులు అకస్మాత్తుగా వాయిదా వేశారు. అభ్యర్థుల సోషల్ మీడియా పోస్టులను, వారి ఆన్‌లైన్ ప్రొఫైల్స్‌ను మరింత లోతుగా పరిశీలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం ఇంటర్వ్యూ తేదీలు ఉన్న కొంతమంది అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందింది. వారి వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మే వరకు కూడా వాయిదా పడుతున్నాయని అమెరికా అధికారులు తెలియజేశారు.

ఈ పరిణామంపై అనేక మంది భారతీయులు ప్రభుత్వాన్ని సంప్రదించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. వీసా అపాయింట్‌మెంట్లను తిరిగి షెడ్యూల్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు ఫిర్యాదులు చేశారని ఆయన చెప్పారు. వీసాలకు సంబంధించిన అంశాలు ప్రతి దేశానికి చెందిన సార్వభౌమ నిర్ణయాల పరిధిలోకి వస్తాయని జైస్వాల్ పేర్కొన్నారు. అయితే ఈ సమస్యపై భారత్ తన ఆందోళనను న్యూఢిల్లీతో పాటు వాషింగ్టన్ డీసీలోనూ అమెరికా ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు.

ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో చాలా మంది భారతీయులు భారత్‌లోనే నెలల పాటు చిక్కుకుపోయారని, దీనివల్ల వారికి, వారి కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం అమెరికాకు తిరిగి వెళ్లలేకపోవడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. భారతీయులపై పడుతున్న ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వంతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని జైస్వాల్ స్పష్టం చేశారు. ఈ ఆలస్యాల వల్ల ఏర్పడిన అంతరాయాలను తగ్గించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

డిసెంబర్ 15వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయిన హెచ్-1బీ వీసా అభ్యర్థులందరికీ ఈ వాయిదా వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. వీరిలో అత్యధికులు సెలవులపై ఇప్పటికే భారత్‌కు రాగా, ప్రస్తుత పరిణామాలతో తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. చేతిలో చెల్లుబాటు అయ్యే వీసా లేకపోవడంతో తమ ఉద్యోగ విధుల్లో చేరలేక పోతున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలు తీవ్ర అనిశ్చితిలో పడిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల రద్దుపై భారత్ ఆందోళన - Tholi Paluku