
హెచ్-1బీ వీసాల దుర్వినియోగం.. టెక్సాస్ కంపెనీలపై దర్యాప్తుకు ఆదేశం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు ఇచ్చే హెచ్-1బీ వీసాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. టెక్సాస్ రాష్ట్రంలోని మూడు ప్రధాన కంపెనీలు వీసా నిబంధనలను ఉల్లంఘించి, మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జనవరి 28న టెక్సాస్ అటార్నీ జనరల్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
అడ్రస్ లేని కంపెనీలు
ఈ విచారణలో బయటపడిన ప్రధాన విషయం ఏమిటంటే, కొన్ని కంపెనీలు కేవలం కాగితాల మీద మాత్రమే కనిపిస్తున్నాయి. బయట అసలు ఆఫీసులే లేని చోట కంపెనీలు ఉన్నట్లు సృష్టించి, వాటిని 'ఘోస్ట్ ఆఫీసులు'గా పిలుస్తున్నారు. ఉదాహరణకు ఒక కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఒక ఇంటి అడ్రస్‌ను తన కార్పొరేట్ ఆఫీసుగా చూపించింది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే అది ఖాళీగా ఉన్న సగం నిర్మించిన ఇల్లు మాత్రమేనని అధికారులు గుర్తించారు. ఇలాంటి దొంగ కంపెనీల ద్వారా విదేశీయులకు వీసాలు స్పాన్సర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
వెబ్‌సైట్ ఉంది.. కానీ వ్యాపారం లేదు
ఈ కంపెనీలకు వెబ్‌సైట్లు ఉన్నాయి, అందులో రకరకాల సేవలు అందిస్తున్నట్లు రాసి ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆ కంపెనీలు ఎలాంటి వ్యాపారం చేయడం లేదు, కనీసం లాభాలు కూడా గడించడం లేదు. కేవలం హెచ్-1బి వీసాలు పొందడం కోసమే ఈ కంపెనీలు పుట్టుకొచ్చాయని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఉండే అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది.
కఠిన చర్యలకు సిద్ధమైన టెక్సాస్ ప్రభుత్వం
అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. "హెచ్-1బి వీసా ప్రోగ్రాం పేరుతో మోసాలకు పాల్పడే వారు చట్టం నుంచి తప్పించుకోలేరు" అని ఆయన హెచ్చరించారు. విచారణలో భాగంగా ఆ మూడు కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల వివరాలు, వారి కమ్యూనికేషన్ రికార్డులన్నీ సమర్పించాలని సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ జారీ చేశారు.
సామాన్యులకు కలిగే నష్టం ఏమిటి?
ఇలాంటి మోసపూరిత పద్ధతుల వల్ల నిజాయితీగా, చట్టబద్ధంగా వీసాలు పొందాలనుకునే వారికి తీరని అన్యాయం జరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అక్రమ మార్గాల్లో వీసాలు పొందే వారు పెరిగిపోతే, అసలైన నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోతాయి. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఇటీవలే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రభుత్వ సంస్థల్లో కొత్త హెచ్-1బీ వీసాల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విచారణలు, ఆంక్షల వల్ల భవిష్యత్తులో అమెరికాలో ఉద్యోగం పొందాలనుకునే విదేశీయులకు నియామక ప్రక్రియ మరింత కఠినంగా మారే ప్రమాదం ఉంది.
