

హెచ్ఐవీ రహిత సమాజమే లక్ష్యం: మంత్రి దామోదర రాజనర్సింహ
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని, హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపడం నేరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన భారీ 'మానవహారం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీలు, హ్యూమన్ చైన్‌లు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హెచ్‌ఐవీ రోగనిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్ అని, సమయానికి చికిత్స చేయకపోతే అది ఎయిడ్స్‌కు దారితీస్తుందని వివరించారు. రక్షణలేని శారీరక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి వంటి కారణాల వల్ల హెచ్‌ఐవీ సోకుతుందని, చేతులు కలుపుకోవడం, ఆలింగనం చేయడం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు.
అవగాహన లోపమే భయాలు, అపోహలు, వివక్షకు కారణమవుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారిని సమాజం వివక్షకు గురిచేయకుండా గౌరవంతో, సహానుభూతితో చూడాలని పిలుపునిచ్చారు. హెచ్‌ఐవీ & ఎయిడ్స్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) చట్టం, 2017 ప్రకారం హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపడం శిక్షార్హమైన నేరమని గుర్తుచేశారు.
వైద్యరంగ అభివృద్ధితో హెచ్‌ఐవీ ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించినా, ఇప్పుడు సమయానికి పరీక్షలు, సరైన చికిత్సతో బాధితులు అనేక సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వమే ఉచిత పరీక్షలు, చికిత్స, మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ఎ ఆర్ టి కేంద్రాల ద్వారా 1.14 లక్షల మంది రోగులకు వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, జైళ్లలో హెచ్‌ఐవీ, టిబి ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
యువత స్థిర జీవనశైలి, దుష్ట అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా ఇంజెక్షన్ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. ఇవి హెచ్‌ఐవీ సహా ఎన్నో అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
ఆరోగ్యం లేకపోతే ధనానికి విలువ లేదని, ఆరోగ్యంతోనే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం బలోపేతం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణను మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దడానికి సమాజంలోని ప్రతి వర్గం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, హెల్త్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
