Let's talk: editor@tmv.in
‘హూలిగనిజం’తో న్యాయవృత్తి కలుషితం: సుప్రీంకోర్టు

‘హూలిగనిజం’తో న్యాయవృత్తి కలుషితం: సుప్రీంకోర్టు

Pinjari Chand
19 మార్చి, 2026

ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకి జిల్లాలో టోల్ ప్లాజా వివాదం నేపథ్యంలో న్యాయవాదుల ప్రవర్తనపై బుధవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘హూలిగనిజం(గూండాగిరి) వంటి చర్యలతో న్యాయవృత్తి కలుషితమైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. జనవరి 14న హైదర్‌గఢ్ తహసీల్ పరిధిలో టోల్ ప్లాజా వద్ద ఓ వాహనం వెళ్లే విషయంలో జరిగిన వివాదంలో అడ్వకేట్ రత్నేష్ శుక్లాపై దాడి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన న్యాయవాదులు లక్నో–సుల్తాన్‌పూర్ జాతీయ రహదారి 731పై టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కార్యకలాపాలను నిలిపివేశారు. తర్వాత స్థానిక బార్ అసోసియేషన్ తీర్మానం చేసి, కేసులో నిందితులకు ఎవరూ వాదించరాదని నిర్ణయించింది. అయితే, ఈ తీర్మానాన్ని లెక్కచేయకుండా అడ్వకేట్ మనోజ్ శుక్లా నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.

ఆగ్రహించిన కొంతమంది న్యాయవాదులు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఫర్నిచర్‌కు నిప్పంటించడంతో పాటు ప్రతిమను దహనం చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు తమకు న్యాయ సహాయం అందడం లేదని, విచారణను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలను పరిశీలించిన కోర్టు, నిందితులకు బెయిల్ నిరాకరించడం అన్యాయమని స్పష్టం చేసింది. రెండు నెలలకు పైగా స్వేచ్ఛను హరించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది. నిందితులకు సరైన న్యాయ సహాయం అందించేందుకు, కేసును ఢిల్లీకి తరలిస్తూ, తదుపరి విచారణను టిస్ హజారి కోర్టుకు బదిలీ చేసింది. అదేవిధంగా, బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితుల భద్రత బాధ్యత ఉత్తరప్రదేశ్ డీజీపీదేనని కోర్టు స్పష్టం చేసింది.

న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాల ధర్మాసనం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ‘ఒకప్పుడు గొప్ప వృత్తిగా భావించిన న్యాయ వ్యవస్థపై ఇప్పుడు హూలిగనిజం మచ్చపడింది. సహచర న్యాయవాదిపై హింసకు దిగడం ఏ విధంగానూ సమర్థించలేం అని పేర్కొంది. న్యాయవాదుల మధ్య స్నేహభావం ఉండటం సహజమే అయినప్పటికీ, చట్టవ్యతిరేక చర్యలకు అది కారణం కావడం అసహ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.

‘హూలిగనిజం’తో న్యాయవృత్తి కలుషితం: సుప్రీంకోర్టు - Tholi Paluku