Let's talk: editor@tmv.in
హుస్సేన్ సాగర్: జంట నగరాల వారధి

హుస్సేన్ సాగర్: జంట నగరాల వారధి

Dantu Vijaya Lakshmi Prasanna
5 జనవరి, 2026

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను అనుసంధానించే హుస్సేన్ సాగర్, నగరం నడిబొడ్డున ఉన్న ఒక అద్భుతమైన కృత్రిమ సరస్సు. 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా హయాంలో నిర్మించబడిన ఈ సరస్సు, ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఒకటిగా గుర్తింపు పొందింది. సరస్సు మధ్యలో 'రాక్ ఆఫ్ జిబ్రాల్టర్' పై కొలువై ఉన్న భారీ ఏకశిలా బుద్ధ విగ్రహం నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. చుట్టూ ఉన్న లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్ వంటి ప్రదేశాలతో ఈ సరస్సు పర్యాటకులకు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో బోటింగ్ ఆహ్లాదకరమైన వినోదానికి ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

హుస్సేన్ సాగర్ చరిత్ర, నిర్మాణం

హైదరాబాద్ నగర కేంద్రానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుస్సేన్ సాగర్, హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో ఒకటి. ఈ సరస్సు నగరం రెండు భాగాలను (సికింద్రాబాద్, హైదరాబాద్) కలుపుతుంది. ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు అయిన హుస్సేన్ సాగర్‌ను 1562 ఏడి లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో తవ్వించారు. మూసీ నది ఉపనదిపై నిర్మించిన ఈ సరస్సుకు హుస్సేన్ షా వలీ పేరు పెట్టారు. ప్రారంభంలో నగరంలోని ప్రజలకు సాగు, తాగునీటి, ఇతర నీటి అవసరాలను తీర్చడానికి దీనిని నిర్మించారు. 1930 సంవత్సరం వరకు ఇది అదే అవసరాల కోసం ఉపయోగించబడింది.

తూర్పున ఇందిరా పార్క్, ఉత్తరాన సంజీవయ్య పార్క్, దక్షిణాన లుంబినీ పార్క్ సరిహద్దులుగా ఉన్న ఈ సరస్సు, నగర మధ్యలో అరుదైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి దీని గట్టుపై ఒక బండ్ (గట్టు) నిర్మించబడింది. ఈ కృత్రిమ సరస్సు ఇప్పుడు నగరాన్ని ఎంతో అందంగా మణిహారంలా ఉంది. కేవలం అందానికే కాకుండా, దీనికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఈ సరస్సు ఒడ్డునే మొఘలులకు, గోల్కొండకు మధ్య ఒప్పందం జరిగింది.

బుద్ధ విగ్రహం

సరస్సు మధ్యలో, 'రాక్ ఆఫ్ జిబ్రాల్టర్' పై 16 మీటర్ల ఎత్తు, దాదాపు 350 టన్నుల బరువున్న భారీ బుద్ధ విగ్రహం కొలువై ఉంది. తెల్లటి గ్రెనైట్‌తో చేసిన ఈ విగ్రహం వద్ద లైటింగ్ షో చూడముచ్చటగా ఉంటుంది. దీనితో పాటు, సరస్సు చుట్టూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల దాదాపు 30 విగ్రహాలు ఉన్నాయి.

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం నగరానికి ఒక విశిష్ట గుర్తుగా నిలిచింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్.) గారికి వచ్చింది. మానవతా విలువలు, శాంతి, అహింసకు ప్రతీకగా గౌతమ బుద్ధుడిని ప్రపంచానికి చాటాలని ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. తెల్ల గ్రానైట్ రాయితో తయారైన ఈ విగ్రహాన్ని ప్రసిద్ధ శిల్పి ఎస్.ఎం. గణపతి స్థపతి రూపకల్పన చేశారు. దాదాపు 58 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహాలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. విగ్రహాన్ని రాయిగిరి (భువనగిరి సమీపం) ప్రాంతం నుంచి తీసుకువచ్చి చెక్కడం, తరలించడం చాలా సంవత్సరాలు పట్టింది.

విగ్రహాన్ని సరస్సు మధ్యలోని జిబ్రాల్టార్ రాక్ పై ప్రతిష్ఠించే ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. 1990లో సరస్సులోకి తరలించే సమయంలో విగ్రహం పడిపోవడంతో దురదృష్టవశాత్తు కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దీర్ఘకాల శ్రమతో విగ్రహాన్ని మళ్లీ పైకి తీసి, చివరకు 1992 డిసెంబర్ 1న అధికారికంగా ప్రతిష్ఠించారు. తరువాత కాలంలో ఇది హైదరాబాద్‌కు ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. 2006లో దలైలామా ఈ విగ్రహాన్ని దర్శించడంతో దీనికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ బుద్ధ విగ్రహం నేటికీ హైదరాబాద్ నగరానికి శాంతి, సౌహార్దం, సంస్కృతి ప్రతీకగా నిలుస్తోంది.

వినోద కార్యక్రమాలు

ప్రజాదరణ పొందిన వినోద కేంద్రంగా, హుస్సేన్ సాగర్ అన్ని వయసుల వారిని ఆకర్షిస్తుంది. ఫ్యామిలీ పిక్నిక్ అయినా, స్నేహితులతో సరదాగా గడపడానికైనా ప్రతి హైదరాబాద్ వాసి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ బోటింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు బోటింగ్ చేయడానికి స్పీడ్ బోట్లు, మోటార్ బోట్లు అందుబాటులో ఉంటాయి. 48 సీట్ల సామర్థ్యం కలిగిన లాంచ్‌లో డిన్నర్ చేయవచ్చు, అలాగే ప్రైవేట్ పార్టీలకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. పారాసెయిలింగ్, వాటర్ స్కీయింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి (వీటి సమయాలు మారుతుంటాయి).

ప్రయాణ సౌకర్యాలు

హుస్సేన్ సాగర్ నగరంలోని మిగతా ప్రాంతాల నుండి సులభంగా చేరుకోదగిన ప్రదేశంలో ఉంది. లోకల్ ట్రైన్లు, బస్సులు, టాక్సీలు, ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. దీనికి సమీపంలో బిర్లా మందిర్, ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్ వాటర్ పార్క్ వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ పర్యటించవచ్చు. వారం అంతా సందర్శించవచ్చు.

నెక్లెస్ రోడ్డు

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్న నెక్లెస్ రోడ్డు, నగరంలో అత్యంత ప్రసిద్ధమైన హ్యాంగ్-అవుట్ స్పాట్. దీని ఆకారం ఆకాశం నుండి చూసినప్పుడు మెడలోని హారంలా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రహదారి సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ లుంబినీ పార్కులను కలుపుతుంది. ఇక్కడ ఉండే 'ఈట్ స్ట్రీట్', 'వాటర్ ఫ్రంట్' రెస్టారెంట్లు రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలకు పేరుగాంచాయి. ఆహ్లాదకరమైన గాలి, సరస్సు అందాలు, విశాలమైన ఫుట్‌పాత్‌లు ఉండటంతో ఉదయం వేళల్లో వాకర్స్‌కు, సాయంత్రం వేళల్లో సరదాగా లాంగ్ డ్రైవ్ లేదా నడకకు వెళ్లేవారికి ఇది ఇష్టమైన ప్రదేశం. దీనిని ఇప్పుడు అధికారికంగా పి.వి. నరసింహారావు మార్గ్ అని పిలుస్తున్నారు.

బిర్లా మందిర్

హుస్సేన్ సాగర్ సరస్సుకు చాలా దగ్గరలో, నౌబత్ పహాడ్ అనే చిన్న కొండపై ఈ ఆలయం ఉంది. ఇది శ్రీవేంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఆలయం. దాదాపు 2,000 టన్నుల స్వచ్ఛమైన తెల్లని రాజస్థానీ మకర్ రాతితో దీనిని నిర్మించారు. ఈ ఆలయానికి ఎక్కడా సిమెంట్ వాడకపోవడం ఒక విశేషం. ఇది దక్షిణ భారత (ద్రవిడ), ఉత్తర భారత (రాజస్థానీ), ఒడిశా వాస్తుశిల్ప రీతుల కలయికతో అద్భుతంగా ఉంటుంది.

ప్రత్యేకత:

కొండపై ఉండటం వల్ల ఇక్కడి నుండి హుస్సేన్ సాగర్, చార్మినార్ మొత్తం హైదరాబాద్ నగరం అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నగరం వెలుగులు ఇక్కడి నుండి అద్భుతంగా కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 9:00 వరకు సందర్శించడానికి అనుమతి ఉంటుంది.

ప్రకృతి సౌందర్యం - ఎన్టీఆర్ గార్డెన్

భారతదేశంలోని అత్యంత ఖరీదైన తోటలలో ఒకటిగా పరిగణించబడే ఎన్టీఆర్ గార్డెన్, హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం, అప్పటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు నందమూరి తారక రామారావు స్మారకార్థం నిర్మించబడింది. ఈ నాయకుడికి నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పార్కును రూపొందించింది. నేడు, ఎన్టీఆర్ గార్డెన్ హైదరాబాద్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగానే కాకుండా, ఒక ఆకర్షణీయమైన విశ్రాంతి, వినోద కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది.

ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు సమీపంలో ఉన్న ఈ పార్కు, నగర జీవితంలోని బిజీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఒక చక్కని ప్రదేశం. ఇక్కడి రంగురంగుల పువ్వులు, చెట్లు రకరకాల మొక్కలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రశాంతమైన వాతావరణంతో పాటు, సందర్శకులను అలరించడానికి ఇక్కడ అనేక వినోద కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో మచాన్ ట్రీ, కార్ కేఫ్, పిల్లల ఆట స్థలం జపనీస్ పార్క్ ప్రధానమైనవి. అలాగే ఇక్కడ జ్ఞాపికల విక్రయశాలలు అనేక ఆహారశాలలు ఉన్నాయి.

ఎన్టీఆర్ గార్డెన్‌లో మరెన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ, పార్కు అంతటా తిరిగే మోనో రైల్, సందర్శకులను కట్టిపడేసే జలపాతం పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులో బోటింగ్ చేసే సౌకర్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడి రెస్టారెంట్లలో లభించే భోజనం కూడా చాలా ప్రత్యేకమైనది. పార్కులోని పచ్చదనం మనస్సుకు ఎంతో ప్రశాంతతను, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఒక స్మారక చిహ్నంగా ప్రారంభమైన ఈ ప్రదేశం, నేడు రోజంతా పర్యాటకులతో కిటకిటలాడే ఒక ప్రసిద్ధ వినోద ఉద్యానవనంగా మారింది. కుటుంబమంతా ఒకరోజు ఆటవిడుపుగా దీని సందర్శనను ఎంచుకోవచ్చు.

ముఖ్య సమాచారం

ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 9:00 వరకు తెరిచి ఉంటుంది. వారాంతాల్లో (శని, ఆదివారాల్లో) రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 గా ఉంటుంది. లోపల మోనో రైల్, బోటింగ్ లేదా ఇతర రైడ్స్ కోసం విడిగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టిల్ కెమెరా తీసుకువెళ్లడానికి సుమారు రూ.30 నుండి రూ .50 వరకు ఛార్జీ ఉంటుంది. ఈ పార్కును సందర్శించడానికి సాయంత్రం 4:00 నుండి 7:00 గంటల సమయం చాలా ఉత్తమమైనది. విద్యుత్ దీపాల వెలుగులో పార్కు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న 'టాయ్ ట్రైన్' లేదా 'మోనో రైల్' పిల్లలకు చాలా ఇష్టమైన ఆకర్షణ. అలాగే జెయింట్ వీల్ వంటి ఇతర రైడ్స్ కూడా ఉంటాయి. పార్కు లోపల రకరకాల ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ముఖ్యంగా 'కార్ కేఫ్' ఒక వెరైటీ అనుభూతిని ఇస్తుంది. ఎన్టీఆర్ గార్డెన్ చూసిన తర్వాత నడక దూరంలో ఉన్న లుంబినీ పార్క్ కు వెళ్లి అక్కడ 'లేజర్ షో' చూడవచ్చు లేదా బిర్లా మందిర్ సందర్శించవచ్చు.

లుంబినీ పార్క్,

హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న లుంబినీ పార్క్, హైదరాబాద్‌లోని అత్యంత ఆకర్షణీయమైన వినోద కేంద్రాలలో ఒకటి. దాదాపు 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ అద్భుతమైన లేజర్ షో, ఇది హైదరాబాద్ చరిత్రను కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. అలాగే, సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే మ్యూజికల్ ఫౌంటెన్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. సరస్సు మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ఇక్కడి నుండే బోటింగ్ సౌకర్యం ఉంటుంది. పచ్చని చెట్లు, అందమైన పూలమొక్కలు, పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలాలతో ఉన్న ఈ పార్కు, కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం వేళ ఆహ్లాదంగా గడపడానికి ఒక సరైన ప్రదేశం.