
హుస్నాబాద్ మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ఇంటింటి ప్రచారం
మున్సిపల్ ఎన్నికల వేళ హుస్నాబాద్ రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటన చేశారు.
హుస్నాబాద్ పట్టణంలోని మొదటి వార్డులోని కేవీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్‌కు మద్దతుగా డోర్ టు డోర్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి గడపను సందర్శిస్తూ మహిళలు, చిన్నారులు, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దిశగా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు సుందరీకరణ, అర్బన్ ఫారెస్ట్ పార్క్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్‌లోని 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బలం చేకూరుతుందని ప్రజలను కోరారు.
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు, ఇందిరమ్మ చీరలు, ఉద్యోగాల భర్తీ వంటి పథకాలను వివరించారు.
అలాగే హుస్నాబాద్ 12వ వార్డులో కేశవేని రమేష్‌కు, 13వ వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రజలను విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్‌లో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలపై కూడా ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించినట్లు తెలిపారు.
