Let's talk: editor@tmv.in
హుస్నాబాద్ జిల్లాలో పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: మంత్రి పొన్నం

హుస్నాబాద్ జిల్లాలో పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
23 అక్టోబర్, 2025

హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా సేకరించడానికి నియోజకవర్గంలో పత్తి, మక్కల (మొక్కజొన్న) కొనుగోలు కేంద్రాలను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంది.

పత్తి కొనుగోలు కేంద్రం

పత్తి రైతుల సౌకర్యార్థం కొండాపూర్ గ్రామ సమీపంలోని గో మాత పత్తి మిల్లు ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా భారత పత్తి సంస్థ పర్యవేక్షణలో రైతుల నుండి నాణ్యమైన పత్తిని సేకరించనున్నారు. మిల్లు ప్రాంగణంలో కేంద్రం ఏర్పాటు కావడం వల్ల రైతులు తమ పత్తిని విక్రయించడానికి రవాణా సౌకర్యంతో పాటు ఇతర వసతులు కూడా అందుబాటులోకి వస్తాయి. రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే 2025-26 కొనుగోలు సీజన్‌కు పత్తికి కనీస మద్దతు ధరలు క్వింటాల్‌కు రూ.7,710 (మీడియం స్టేపుల్) క్వింటాల్‌కు రూ.8,110 (లాంగ్ స్టేపుల్)గా నిర్ణయించబడ్డాయి. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయబడదని, 8 శాతం కంటే తక్కువ తేమ ఉంటే ప్రోత్సాహకం ఉంటుందని కూడా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది.

మక్కల కొనుగోలు కేంద్రం

అదేవిధంగా, హుస్నాబాద్ ప్రాంత రైతులు పండించిన మక్కలను (మొక్కజొన్న) సేకరించడానికి హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర వద్ద మక్కలను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దళారుల జోక్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని మంత్రి అధికారులు సూచించారు. మక్కలను రూ. 2,090 క్వింటాల్‌కు ఈ ధరలే ప్రస్తుతం రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో చెల్లించబడుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని, మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలు పాటించి, సమయానికి తమ పంటలను కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

హుస్నాబాద్ జిల్లాలో పత్తి, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: మంత్రి పొన్నం - Tholi Paluku