Let's talk: editor@tmv.in
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం

Gaddamidi Naveen
16 నవంబర్, 2025

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో చేప సంరక్షణ,సాగు అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మరో కీలక అడుగు పడింది. ఎల్లమ్మ చెరువులో చేపల సంపదను పెంపొందించడం కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ శ‌నివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మత్స్యకారుల సంక్షేమం, వారి ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ సందర్భంగా, ఎల్లమ్మ చెరువులో మొత్తం 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ చేప పిల్లల కొనుగోలుకు అయిన వ్యయం రూ. 5.17 లక్షలుగా మంత్రులు తెలిపారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ, చేపల ఉత్పత్తి పెంపుతో మత్స్యకార కుటుంబాలకు ఆదాయ వృద్ధి చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో మత్స్యవ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జ‌రుగుతుంద‌ని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధిని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు ఈ చేప పిల్లల పంపిణీ పెద్ద సహాయకారిగా ఉండనుందని చెప్పారు.

అనంతరం ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పెంపకం, పంపిణీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. నియోజకవర్గంలోని అన్ని జలాశయాలలోను దశలవారీగా చేప పిల్లల విడుదల జరుగుతుందని,దీని వలన మత్స్య సంపద గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం స్థానిక మత్స్య సహకార సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం - Tholi Paluku