
హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
తెలంగాణ రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణంలో పర్యటించి, అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో పర్యటిస్తూ ప్రధానంగా చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై దృష్టి సారించారు.
కొత్త చెరువులోకి పట్టణ డ్రైనేజీ నీరు కలవకుండా నేరుగా ప్రత్యేక ఫీడర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లమ్మ చెరువు వద్ద నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి, గ్రీనరీ లాన్, ఓపెన్ జిమ్ పనులను పరిశీలించి, కట్టపై ఉన్న గుట్టపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో నిర్మిస్తున్న నూతన షెడ్లు, పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే 8, 9 వార్డులకు సంబంధించి శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి, పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.
జిల్లలగడ్డ వద్ద అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను పరిశీలించిన మంత్రి, అక్కడ ఇప్పటికే పూర్తయిన మట్టి ట్రాక్, వాటర్ సంపు పనులను చూశారు. పిల్లల కోసం ఆకర్షణీయమైన క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని, నాచురల్ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. పుట్టలొద్ది, గాడిద లొద్ది మధ్య లక్నవరం తరహాలో కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, ఎత్తైన గుట్టలపై వాచ్ టవర్లు నిర్మించాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హుస్నాబాద్‌ను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
