
హుస్నాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్యుత్, సాగునీరు వంటి కీలక రంగాలపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు రోజుల పాటు మండల స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులతో విస్తృత స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రభుత్వ సేవలు చేరాలన్న లక్ష్యంతో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలని, సిబ్బంది కొరత అంశంపై విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి నియోజకవర్గంలోని 43 రైతు వేదికలపై మండల వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. సాగునీటి ట్యాంకుల్లో చేపల పెంపకం, నీటి సరఫరా వంటి అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు మంత్రి చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, సమస్యల పరిష్కారంపై ఎంఈవోలను సంప్రదించి సమీక్షించామని తెలిపారు. అలాగే విద్యుత్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు, వేలాడుతున్న కేబుల్స్ వంటి భద్రతా సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామని మంత్రి పేర్కొన్నారు.
మండలాల వారీగా ఎమ్మార్వో, ఎంఈవో, ఎంపిడివో, ఏంఏవో తదితర అధికారులు సమన్వయం చేసుకుని సమస్యలపై సమగ్ర నివేదికలు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రామ కార్యదర్శులు, విలేజ్ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెడ్‌మాస్టర్లతో సమావేశాలు నిర్వహించి వివరమైన నివేదికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ తాగునీరు, రోడ్లకు సంబంధించిన సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు మంత్రి తెలిపారు.
గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా నిర్మించలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మంజూరు పొందిన లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే దశలవారీగా వారం రోజుల్లో బిల్లులు వస్తాయని భరోసా ఇచ్చారు. కొత్తగా మరిన్ని ఇళ్ల మంజూరుకు కూడా అవకాశం ఉందన్నారు.
హుస్నాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం వెటర్నరీ స్కీమ్‌కు ప్రత్యేక పథకం ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లను పూర్తిచేస్తున్నామని ఆయన తెలిపారు. సర్వాయి పాపన్న కోట అభివృద్ధి, మహాసముద్రం గండి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, కొత్త చెరువు అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల్లోని సమస్యలపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, వీటన్నింటిపై జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు.
