
హుస్నాబాద్‌లో చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గం, చిగురు మామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గార్డెన్స్‌లో మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టి సాంప్రదాయబద్ధంగా చీరలను అందజేశారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, ఆర్థికంగా బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.ప్రతి మహిళ గౌరవంగా జీవించే సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం విభిన్న కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి గుర్తు చేశారు.
చీరల పంపిణీ అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా అందజేశారు. పెళ్లి ఖర్చులు కుటుంబాలపై భారంగా మారకుండా, పేద కుటుంబాల బాలికలకు సహాయం చేయడం కోసం ఈ పథకం కీలకంగా మారిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు వేలాది మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు వారు పేర్కొన్నారు.
కోహెడ మండలంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ
కోహెడ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు బొట్టు పెట్టి చీర అందించారు. అనంతరం, 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు సమాజ అభివృద్ధికి బలం అనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు అవుతున్నాయని వివరించారు.
ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన
తరువాత కోహెడ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఆలయ అభివృద్ధి ద్వారా ప్రాంతీయ భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఆలయ భద్రతకు, అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
