Let's talk: editor@tmv.in
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన‌ మంత్రి పొన్నం

హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన‌ మంత్రి పొన్నం

Gaddamidi Naveen
19 జనవరి, 2026

సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రారంభం వద్ద ఏర్పాటు చేసిన నమస్తే స్టాచ్యును రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

నమస్తే స్టాచ్యు ఆవిష్కరణ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేస్తున్న క్రీడాకారుల స్టాచ్యుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధితో పాటు సాంస్కృతిక, క్రీడా విలువలను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణకారుల సంఘం భవనంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన 8, 9, 17, 18, 19 వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే 3520 మంది మహిళలకు కోటి 13 లక్షల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన మరో కార్యక్రమంలో 1, 10, 11, 12, 13 వార్డుల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు కోటి 13 లక్షల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులు కూడా అందజేశారు.

అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను పంపిణీ చేశారు. అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, 57 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించారు.