Let's talk: editor@tmv.in
హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాం: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాం: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
12 జనవరి, 2026

హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్ధిపేట జిల్లాలో కలిపారని, ఈ ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోనే ఉండాలన్నది స్థానిక ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పులు చేపడితే హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్‌ జిల్లాలో కలపడం తథ్యమని ఆయన తెలిపారు.

ఈ అంశాన్ని స్థానిక శాసన సభ్యుడిగా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి గతంలో పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు అంబేద్కర్‌ సర్కిల్‌లో నిర్వహించిన సభలో హుస్నాబాద్‌ను కరీంనగర్‌ జిల్లాలో కలుపుతామని స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆ హామీని ప్రభుత్వం విస్మరించదని, సరైన సందర్భం వచ్చినప్పుడు శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

బైక్‌పై 16 కిలోమీటర్ల క్షేత్రస్థాయి పరిశీలన

అనంతరం హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్‌ కుడి కాలువను మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా పరిశీలించారు. గౌరవెల్లి నుంచి మల్లారం వరకు సుమారు 16.5 కిలోమీటర్ల మేర బైక్‌పై ప్రయాణిస్తూ కాలువ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ ఈఈ రాములు సహా సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

కాలువ నిర్మాణం మొత్తం పూర్తైనప్పటికీ, కొన్ని చోట్ల అడ్డంకులు ఉన్నాయని, పలు గ్రామాలకు వెళ్లేందుకు కాలువలపై అవసరమైన బ్రిడ్జిల నిర్మాణం ఇంకా చేయాల్సి ఉందని మంత్రి గుర్తించారు. అలాగే కాలువల వెంట పెరిగిన చెట్లు, పొదలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంటూ వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపట్టి, రైతులకు నీటి సరఫరా నిరవధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్‌ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటి లాభం పూర్తిస్థాయిలో అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పరిష్కారాలు అందించేందుకు ఇలాంటి పరిశీలనలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.