
హుజురాబాద్‌ను విషతుల్యం చేయనివ్వం: ఎంపీ ఈటల రాజేందర్
హుజురాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసే డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. శనివారం హుజురాబాద్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షాకు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని జవహర్ నగర్, బాలాజీ నగర్ డంపింగ్ యార్డుల వల్ల లక్షలాది మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, దానికి తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నారు. అక్కడ ప్రజలు సంపాదించే కూలీ డబ్బులన్నీ ఆసుపత్రులకే సరిపోతున్నాయి. అందుకే ఎంపీగా గెలిచిన తర్వాత జవహర్ నగర్ సమస్యపై సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వేశాను. వారం రోజుల్లో ఎంపీల బృందంతో కలిసి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం అని తెలిపారు.
చెత్త నుంచి కరెంటు తయారు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు. ఈ ప్లాంట్ల వల్ల వచ్చే భయంకరమైన శబ్దాలు, గాలిలో వెలువడే పురుగుల వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. భూగర్భ జలాలు విషతుల్యమై పచ్చటి నీరు వస్తాయి. ఆ నీటితో కనీసం ముఖం కూడా కడుక్కోలేం. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సెంటు కొట్టి వాసన రాకుండా చేస్తారు తప్ప, రాత్రిపూట ఆ కలుషిత నీటిని చెరువుల్లోకి వదులుతారు అని దుయ్యబట్టారు.
హుజురాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల చెత్తను ఇక్కడికి తీసుకువచ్చి పవర్ ప్లాంట్లు పెడతామనే పిచ్చి పనులు మానుకోవాలని ఈటల హెచ్చరించారు. నంగనాచి మాటలు చెప్పకండి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే ఖబర్దార్. 2022లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా జీవో ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తను ప్రజల పక్షాన నిలబడే ఉద్యమకారుడినని ఆయన స్పష్టం చేశారు. స్థానిక నాయకులకు చేతకాకపోతే ఈ ఉద్యమానికి తానే స్వయంగా నాయకత్వం వహించి తేల్చుకుంటానని ప్రకటించారు. ఈటల అంటేనే చైతన్యం అని, తాను ఎవరికీ భయపడనని చెబుతూ.. డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తొలగించే వరకు విశ్రమించబోనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
