Let's talk: editor@tmv.in
హీరా గ్రూప్ కేసులో కీలక పరిణామం: అధికారులను బెదిరించిన నకిలీ కన్సల్టెంట్‌ అరెస్ట్

హీరా గ్రూప్ కేసులో కీలక పరిణామం: అధికారులను బెదిరించిన నకిలీ కన్సల్టెంట్‌ అరెస్ట్

Gaddamidi Naveen
13 జనవరి, 2026

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 5,978 కోట్ల హీరా గ్రూప్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేపట్టింది. ఈడీ దర్యాప్తు అధికారులను భయపెట్టి, విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన కళ్యాణ్ బెనర్జీ అనే నకిలీ వ్యక్తిని ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ వ్యక్తి కళ్యాణ్ బెనర్జీని ఈడీ జోనల్ ఆఫీసు జనవరి 10, 2026న పట్టుబట్టి, ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో జనవరి 11న హాజరు చేశారు. కోర్టు అతనిని జనవరి 23, 2026 వరకు జడ్జియల్ కస్టడీకి పంపింది.

అసలేం జరిగింది?

హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఇతరులపై నమోదైన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా, ఈడీ గతంలో అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి నౌహీరా షేక్ అనేక చట్టపరమైన ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఆమె కళ్యాణ్ బెనర్జీ అనే వ్యక్తిని నెలవారీ జీతం, కమిషన్ ప్రాతిపదికన నియమించుకున్నట్లు ఈడీ గుర్తించింది.

అధికారులకు బెదిరింపులు

కళ్యాణ్ బెనర్జీ తనను తాను పెద్ద రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితుడిగా పరిచయం చేసుకున్నాడు. ఈడీ అధికారులకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ.. వేలం ప్రక్రియను నిలిపివేయాలని, తారుమారు చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అధికారులు లొంగకపోవడంతో వారిని తీవ్రంగా బెదిరించడం ప్రారంభించాడు. అతను వివిధ ప్రభుత్వ శాఖలకు కన్సల్టెంట్‌గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. అతడి ఫోన్ సిమ్ కార్డ్ కేవైసి లో తప్పుడు చిరునామా ఇచ్చినట్లు గుర్తించిన ఈడీ, సాంకేతిక పరిజ్ఞానంతో జనవరి 10న సికింద్రాబాద్‌లోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకుంది.

వేలం ప్రక్రియను అడ్డుకునే కుట్ర

నౌహీరా షేక్ బాధితులకు డబ్బులు చెల్లించేందుకు వీలుగా సుప్రీంకోర్టు అనుమతితో జనవరి 5, 2026న ఆస్తుల వేలం నిర్వహించారు. దీనిని అడ్డుకునేందుకు ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా.. న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించినందుకు ఆమెకు రూ. 5 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధిలో జమ చేయాలని ఆదేశించింది.

అరెస్ట్ అయిన‌ కళ్యాణ్ బెనర్జీ వాట్సాప్ చాట్‌లను పరిశీలించగా, అతడు నౌహీరా షేక్ ఆమె అనుచరుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. నేరపూరితమైన ఆస్తులను అక్రమ మార్గాల్లో విక్రయించి భారీగా కమిషన్లు పొందాలని వారు ప్లాన్ చేసినట్లు తేలింది. కళ్యాణ్ బెనర్జీని జనవరి 11న స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతడికి జనవరి 23, 2026 వరకు రిమాండ్ విధించింది. తమ దర్యాప్తులో జోక్యం చేసుకునే ఏ వ్యక్తిపైనైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఈడీ హెచ్చరించింది. ఇప్పటివరకు ఈ కేసులో రూ. 428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.