Let's talk: editor@tmv.in
హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

Gaddamidi Naveen
7 డిసెంబర్, 2025

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హిల్ట్‌ పాలసీ అమలులో భాగంగా ప్రభుత్వం నవంబర్‌ 22న విడుదల చేసిన జీవో 27ను సవాలు చేస్తూ పలు సామాజిక సంస్థలు, వ్యక్తులు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్ లు) దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని సంయుక్తంగా విచారించిన హైకోర్టుకారణములు, వాస్తవ పరిస్థితులు, పాలసీ ఉద్దేశ్యం, అమలు ప్రక్రియ వంటి అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

పిటిషనర్ల వాదనలను కోర్టు పరిశీలించినప్పటికీ, ప్రభుత్వ వాదనలు, పాలసీ ప్రభావం, ప్రజా ప్రయోజనం వంటి కీలక అంశాలపై సమగ్రంగా పరిశీలన అవసరమని స్పష్టం చేసింది. తగిన రికార్డులు, వివరణలు అందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని వ్యాఖ్యానించింది.

హిల్ట్‌ పాలసీలో భాగంగా నవంబరు 22న ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 27ను సవాలు చేస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.జీవో 27 ద్వారా పారిశ్రామిక భూములను ఎలాంటి పరిశీలన లేకుండా, నివాస, వాణిజ్య లేదా మిశ్రమ వాడకాలకు అనుమతించడం చట్టపరంగా సరికాదని పిటిషనర్లు వాదించారు. ఈ మార్పులు పర్యావరణ అసమతుల్యత, ఆరోగ్య సమస్యలు, మాస్టర్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు దారితీసే అవకాశం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ పిల్స్‌పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

జీవో 27 ద్వారా వచ్చిన ముఖ్య మార్పులు

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ నగర భూ వినియోగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పాలసీ ద్వారా సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను పుల్‌టీపర్పజ్,మల్టీ-యూజ్ భూములుగా మార్చడానికి అనుమతి లభించింది.ఈ కీలక మార్పుల వల్ల, ఇంతకు ముందు పరిశ్రమల కోసం మాత్రమే కేటాయించబడిన ఆ భూముల్లో రెసిడెన్షియల్, వాణిజ్య, ఇన్‌స్టిట్యూషనల్ స్కూల్‌లు, హాస్పిటల్‌లు, వాణిజ్య,ఆఫీసుల,పర్యటన/విశ్రాంతి లేదా ఐటీ, ఐటీఈఎస్ వంటివి స్థాపించడానికి అనుమతులు లభిస్తుంది.

ఆన్‌లైన్ దరఖాస్తు, వేగవంతమైన ప్రక్రియ

భూమి వినియోగాన్ని మార్చుకోవడానికి ఆసక్తి ఉన్న యజమానులు టీజీ-ఐపాస్ పోర్టల్ ద్వారా వెబ్ ఆధారితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిశీలించి, పాలసీ ప్రకారం కనీస సమయంలో తుది నిర్ణయం ఇస్తుంది. భూమి మార్పిడి జరిగిన తర్వాత, పట్టాదారులు తమ భూములను విక్రయించడానికి లేదా అభివృద్ధి చేయడానికి వీలుగా అధికారిక రికార్డులు, జోనింగ్ చట్టాలలో మాస్టర్ ప్లాన్ కింద మార్పులు జరుగుతాయి.ఈ విధానం పాత 2013 మాస్టర్ ప్లాన్ ప్రమాణాలను విస్మరిస్తుందని పారిశ్రామిక జోన్‌లో పరిశ్రమలు మాత్రమే ఉండాలనే నిబంధనను ఉల్లంఘిస్తుందని విమర్శకులు పేర్కొంటున్నారు.

హిల్ట్ పాలసీపై మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ - Tholi Paluku