
హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ‘పోరుబాట’: కేటీఆర్
హైదరాబాద్ మహానగర పరిధిలోని దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను, 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' (హిల్ట్ ) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమైంది.దీనిలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన 'నిజనిర్ధారణ బృందాలను' నియమించారు.ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హిల్ట్ ద్వారా జరుగుతుందని పార్టీ ఆరోపిస్తున్న రూ. 5 లక్షల కోట్ల కుంభకోణాన్ని ప్రజల ముందు నిర్ధారణతో ఉంచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూముల మళ్లింపు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాల కోసం అత్యల్ప ధరలకు కేటాయించిన పారిశ్రామిక భూములను ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుమారు 9,300 ఎకరాల భూములను కేవలం ఎస్ఆర్ఓ రేట్లలో 30 శాతం మాత్రమే వసూలు చేసి రెగ్యులరైజ్ చేయడం, ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నమని ఆయన అన్నారు.పేదలకు ఇండ్ల కోసం, స్మశానాల కోసం స్థలాలు లేవని చెప్పే ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
3, 4 తేదీల్లో ఎనిమిది బృందాల క్షేత్రస్థాయి పర్యటనలు
హిల్ట్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పరిశ్రమల కోసం భూములు అప్పగించిన ప్రజల ఆశలు, స్థానిక అవసరాలను తెలుసుకునేందుకు పార్టీ క్లిష్టమైన ప్రణాళిక రూపొందించిందని,డిసెంబర్ 3, 4 తేదీలలో ఎనిమిది క్లస్టర్లుగా విభజించిన నిజనిర్ధారణ బృందాలు హైదరాబాద్ పరిసర పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తాయన్నారు. స్థానిక ప్రజలు, పరిశ్రమ కార్మికులు, నాయకులతో చర్చలు జరిపి ప్రభుత్వం నిర్ణయించిన ధర,వాస్తవ మార్కెట్ విలువ, భూ కేటాయింపుల చరిత్ర పారిశ్రామిక వాడల ద్వారా సాధ్యమయ్యే ప్రజా సేవల విధానాలు వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
ఎస్ఆర్ఓ రేటు మార్కెట్ విలువ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్న బీఆర్ఎస్
హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (హిల్ట్) పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.ఈ బృందాలు ప్రతి పారిశ్రామిక వాడలోని ఎస్ఆర్ఓ రేట్లను అధికారిక రికార్డుల ద్వారా సేకరించి, అదే ప్రాంతంలో ఇటీవల అమ్ముడైన భూముల ధరలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ డేటా, బ్రోకర్ల సమాచారం, స్థానికుల వివరాలు ఆధారంగా ప్రస్తుత నిజమైన మార్కెట్ విలువను లెక్కించనున్నాయి. తరువాత ఈ రెండు విలువల మధ్య ఉన్న భారీ తేడాను ఎకరా వారీగా అంచనా వేసే లెక్కలు తయారు చేసి ప్రజలకు వెల్లడిస్తాయి.
ఉదాహరణకు, ఎకరాకు ఎస్ఆర్ఓ రేటు రూ.50 లక్షలు కాగా మార్కెట్ విలువ రూ.5 కోట్లు ఉంటే, ప్రభుత్వం 30 శాతం వసూలు చేస్తే ధర కేవలం రూ.15 లక్షలు మాత్రమే అవుతుందని, ఇలాంటివి వేల ఎకరాలపై జరుగుతున్నాయని బృందాలు ప్రజలకు వివరిస్తాయని. బీఆర్ఎస్ అభిప్రాయం ప్రకారం, ఈ ప్రక్రియ రాష్ట్రానికి భారీ నష్టం తెస్తుందని పార్టీ ప్రజలకు తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు, కేటాయింపుల నేపథ్యం
గతంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వంటి సంస్థలు, 2001-2006 మధ్యకాలంలో పబ్లిక్ టెండర్లు లేకుండా, 'నామినేషన్' పద్ధతి ద్వారా కొన్ని పరిశ్రమల భూములను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించాయని, ఈ కేటాయింపులపై కోర్టులో పిల్‌లు కూడా దాఖలయ్యాయని తెలుస్తోంది.2022లో, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని లీజు పారిశ్రామిక భూములను ఫ్రీహోల్డ్‌గా (పూర్తి యాజమాన్య హక్కులుగా) మార్చింది. ఈ మార్పు అధికారికంగా జరిగినప్పటికీ, అప్పట్లో దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేవు.అయితే, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఫ్రీహోల్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి.
మరోవైపు, 2024లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు కూడా ఈ వివాదానికి బలం చేకూర్చింది. కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని కంపెనీల అలొట్‌మెంట్‌లను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం, 'యాక్టివ్ కమిట్‌మెంట్' లేకుండా కేటాయించిన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, లక్షల కోట్ల విలువైన ఈ భూముల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
