Let's talk: editor@tmv.in
హిల్ట్‌ పాలసీపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

హిల్ట్‌ పాలసీపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

తెలంగాణలో భూముల పరిరక్షణపై రాజకీయ భగ్గుమంటోంది. హైదరాబాద్ లో భారీ భూకుంభకోణం జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసింది.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్‌– జీఓ నెం.27)పై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ బిజెపి నాయకత్వం, ఈ విధానం ప్రజలకు చెందిన వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేట్ రియల్టర్లకు అప్పగించే ప్రయత్నంగా ఆరోపించింది.

హిల్ట్‌ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.ఈ జీఓ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 9,292 ఎకరాల పారిశ్రామిక భూములు ప్రైవేట్ సంస్థలకు మారే ప్రమాదం ఉందని, దాంతో రాష్ట్రానికి దాదాపు రూ. 5 లక్షల కోట్ల ప్రజా సంపద నష్టపోయే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు.ఈ “కుంభకోణానికి” పూర్తి స్థాయి విచారణ అవసరమని, అందుకోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని నియమించి దర్యాప్తు చేపట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీలు రూపొందిస్తోందని వారు మండిపడ్డారు.

హిల్ట్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని బిజెపి కోరింది. ఈ సమస్యపై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 7వ తేదీన, హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బిజెపి మహా ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది.గవర్నర్‌కి వినతిపత్రం సమర్పణలో బిజెపి శాసనసభాపక్ష నేత మహేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.