Let's talk: editor@tmv.in
హిమాలయ రాష్ట్రాల కోసం హైపర్-లోకల్ వాతావరణ వ్యవస్థ: ఒమర్ అబ్దుల్లా

హిమాలయ రాష్ట్రాల కోసం హైపర్-లోకల్ వాతావరణ వ్యవస్థ: ఒమర్ అబ్దుల్లా

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఫిబ్రవరి, 2026

హిమాలయ రాష్ట్రాల కోసం భారత వాతావరణ శాఖ 'హైపర్-లోకల్' (అత్యంత స్థానిక) వాతావరణ సూచన వ్యవస్థను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఇందులో భాగంగా ఏడు జిల్లాలను గుర్తించారని, ముఖ్యంగా క్లౌడ్‌బర్స్ట్ (మేఘమథనం) వల్ల కలిగే వర్షపాతంపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొంది.

జమ్మూ కాశ్మీర్‌లో మరో నాలుగు డాప్లర్ వాతావరణ రాడార్లను, 26 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను, మంచు కొలిచే పరికరాలను ఏర్పాటు చేయాలని ఐఎండి భావిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే సజాద్ షాహీన్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ హిమాలయ రాష్ట్రాల అంతటా ఏడు జిల్లాలను గుర్తించిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ నుండి రాంబన్, కిష్త్వార్ జిల్లాలు దీనికి ఎంపికయ్యాయన్నారు.

హిమాలయ రాష్ట్రాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ 'హైపర్-లోకల్' (అత్యంత స్థానిక) వాతావరణ సూచన వ్యవస్థను తీసుకురానుంది. ఇది సాధారణ అంచనాల కంటే భిన్నంగా, ఒక నిర్దిష్ట చిన్న ప్రాంతంలో వాతావరణ మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో ముందుగానే గుర్తించడానికి సహాయపడుతుందని తెలిపారు.

క్లౌడ్‌బర్స్ట్ హెచ్చరికలపై దృష్టి

ఈ కొత్త వ్యవస్థ ప్రధానంగా 'క్లౌడ్‌బర్స్ట్' (మేఘమథనం లేదా అకస్మాత్తుగా కురిసే కుంభవృష్టి) వల్ల కలిగే భారీ వర్షాలపై దృష్టి సారిస్తుంది. కొండ ప్రాంతాల్లో ఇవి క్షణాల్లో భారీ వినాశనాన్ని సృష్టిస్తాయి కాబట్టి, ముందస్తు హెచ్చరికల ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ హిమాలయ రాష్ట్రాల్లోని ఏడు జిల్లాలను ఈ ప్రత్యేక జోక్యం కోసం ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం నుండి రాంబన్, కిష్త్వార్ జిల్లాలను అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలుగా గుర్తించి, అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నామని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

15 ఏళ్ల డేటా విశ్లేషణ

గత 15 ఏళ్లలో సంభవించిన 'క్లౌడ్‌బర్స్ట్’, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనల డేటాను శ్రీనగర్‌లోని వాతావరణ కేంద్రం విశ్లేషించింది. ఈ డేటా ఆధారంగా ఏ జిల్లాలో ప్రమాద తీవ్రత ఎంత ఉందో శాస్త్రీయంగా అంచనా వేశారని ముఖ్య మంత్రి తెలిపారు.

జిల్లాలోని మౌలిక సదుపాయాల నష్టం, వ్యవసాయం, పశుసంపద, మానవ ప్రాణనష్టం ఆధారంగా జిల్లాలను మూడు వర్గాలుగా విభజించారు. జమ్మూ డివిజన్‌లో కిష్త్వార్, దోడా, రాంబన్ వంటి ప్రాంతాలు 'హై-రిస్క్' (అధిక ముప్పు) జోన్లలో ఉన్నాయన్నారు.

కాశ్మీర్ లోయలో పరిస్థితి

కాశ్మీర్ డివిజన్‌లో అనంత్‌నాగ్, కుల్గామ్, గందర్బల్ జిల్లాలను అత్యధిక ముప్పు ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు. అదే సమయంలో శ్రీనగర్, బారాముల్లా వంటి జిల్లాలను తక్కువ ముప్పు ఉన్న వర్గంలో చేర్చారు. ఈ వర్గీకరణ వల్ల విపత్తు నిర్వహణ నిధులను ఎక్కడ ఎక్కువగా వెచ్చించాలో స్పష్టత వస్తుందని తెలిపారు.

ప్రస్తుతం శ్రీనగర్, జమ్మూ, బనిహాల్‌లో మూడు రాడార్లు ఉండగా, కొత్తగా మరో నాలుగు డాప్లర్ వాతావరణ రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని దోడా, రాజౌరి, అనంత్‌నాగ్, బారాముల్లా జిల్లాల్లో ప్రతిపాదించారు. ఇవి వాతావరణ మార్పులను సెకన్ల వ్యవధిలో స్కాన్ చేసి సమాచారాన్ని అందిస్తాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు

కేవలం రాడార్లే కాకుండా, క్షేత్రస్థాయిలో డేటాను సేకరించడానికి కిష్త్వార్, కుప్వారా, బందిపోరా వంటి మారుమూల కొండ ప్రాంతాలలో 26 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు, 8 స్నో గేజ్‌లను (మంచును కొలిచే పరికరాలు) ఏర్పాటు చేయనున్నారు. ఇవి మారుమూల కొండ ప్రాంతాలైన కిష్త్వార్, దోడా, రాంబన్, రాజౌరి, ఉధంపూర్ వంటి కొండ ప్రాంతాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం, మంచు కురిసే విధానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి. వరదలు,క్లౌడ్‌బర్స్ట్‌లవల్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోకుండా 'పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్' దీర్ఘకాలిక చర్యలు చేపట్టింది. కొండచరియలు విరిగిపడకుండా స్లోప్ స్టెబిలైజేషన్, బయో-ఇంజనీరింగ్ టెక్నిక్స్, విపత్తులను తట్టుకునేలా బలమైన నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించామని అన్నారు.

జమ్మూ కాశ్మీర్ కోసం 'హజార్డ్, వల్నెరబిలిటీ అండ్ రిస్క్ అసెస్‌మెంట్' నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ రకాల ముప్పులను అంచనా వేసి ఒక 'అట్లాస్'ను సిద్ధం చేస్తుంది, ఇది భవిష్యత్తులో ప్రభుత్వ ప్రణాళికలు, పరిపాలనలో కీలక మార్గదర్శిగా మారుతుందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

కాగా, 2025లో సంభవించిన క్లౌడ్‌బర్స్ట్, వరద నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక బృందాన్ని పంపింది. దీనికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు, ఇది భవిష్యత్తులో విపత్తుల ముప్పును తగ్గించే ప్రణాళికలను రూపొందిస్తుంది.

హిమాలయ రాష్ట్రాల కోసం హైపర్-లోకల్ వాతావరణ వ్యవస్థ: ఒమర్ అబ్దుల్లా - Tholi Paluku