
‘హిమాని పూరి కేసు’ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తెను అమెరికా నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలను కలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆదేశించిన తీర్పుపై కార్యకర్త దాఖలు చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు తీసుకోవడానికి నిరాకరించింది. సోమవారం న్యాయమూర్తులు వివేక్ చౌదరి, రేణు భట్నాగర్‌లతో కూడిన బెంచ్, ఈ విషయంపై తమ అభ్యంతరాలను అదే కేసును విచారించిన సింగిల్ జడ్జి ముందు ఉంచాలని కార్యకర్త కునాల్ శుక్లాకు సూచించింది. అలాగే, మధ్యంతర ఉత్తర్వు కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనే అంశాన్ని వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి కోర్టు సూచించింది.
కోర్టు కునాల్ శుక్లాకు ఒక వారం గడువు ఇచ్చి, హిమానీ పూరి దాఖలు చేసిన ఇంజంక్షన్ పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఏప్రిల్ 23న సింగిల్ జడ్జి ముందుకు తీసుకురావాలని కోర్టు పేర్కొంది. మార్చి 17న సింగిల్ జడ్జి ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తనపై పూర్తి స్థాయి గ్యాగ్ ఆర్డర్ విధించారని శుక్లా తన అప్పీల్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికలపై ఈ విషయానికి సంబంధించిన కంటెంట్ ప్రచురించడం, పంచుకోవడం లేదా ప్రసారం చేయకుండా ఆదేశించారని ఆయన తెలిపారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రజలకు అందుబాటులో ఉన్న పత్రాలు, అంతర్జాతీయ నివేదికలు, అధికారికంగా విడుదలైన సమాచారంపై ఆధారపడి ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తినవేనని శుక్లా పేర్కొన్నారు.
వెంటనే ఎందుకు ఆదేశాలు ఇచ్చారు?
శుక్లా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ, ఫిబ్రవరిలో ప్రచురించిన కంటెంట్‌పై సమాధానం ఇవ్వడానికి రెండు రోజులు సమయం ఇవ్వకుండా వెంటనే ఆదేశాలు ఎందుకు ఇచ్చారని కోర్టును ప్రశ్నించారు. పూరి చేసిన ప్రతి వ్యాఖ్యను సింగిల్ జడ్జి నిజమని భావించి, తదుపరి విచారణ తేదీని ఆగస్టుకు వాయిదా వేశారని ఆయన వాదించారు. అయితే హిమానీ పూరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది మహేశ్ జేఠ్మలాని అప్పీల్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు విన్న తరువాత, శుక్లాకు సమాధానం దాఖలు చేయడానికి సమయం ఇచ్చి విచారణ తేదీని ముందుకు తీసుకురావాలని కోర్టు సూచించింది. దీనికి అప్పీలెంట్ అంగీకరించారు. అప్పీలెంట్ తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది సుధీర్ నంద్రాజోగ్ కేసు విచారణను వేగవంతం చేయాలని కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. హిమానీ పూరి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా దాఖలు చేశారు. అలాగే తనను అవమానపరిచే కంటెంట్‌ను ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
