Let's talk: editor@tmv.in
హిమా‘చిల్‌’..మంచుతో కప్పేసిన కశ్మీర్

హిమా‘చిల్‌’..మంచుతో కప్పేసిన కశ్మీర్

Pinjari Chand
29 జనవరి, 2026

గత 24 గంటలుగా హిమాచల్ ప్రదేశ్ అంతటా విస్తృతంగా వర్షాలు, భారీ హిమపాతం కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం తెలిపింది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. లాహౌల్–స్పితి జిల్లాలోని కుకుమ్సేరిలో కనిష్ఠ ఉష్ణోగ్రత -6.1 డిగ్రీల సెల్సియస్ గా నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. కాగా, కుల్లు జిల్లా బాజౌరాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాష్ట్రంలోని చాలా కేంద్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు తగ్గాయి.

లోయల్లో భారీ వర్షాలు

కింది, మధ్య కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భుంటర్లో 55.4 మి.మీ., సియోబాగ్ 47 మి.మీ., బిలాస్పూర్ 45.6 మి.మీ., గోహర్ 45 మి.మీ., నైనా దేవి 44.6 మి.మీ., కసౌలి 44.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సుందర్‌నగర్, పాండోహ్, సోలన్ ప్రాంతాల్లోనూ గణనీయమైన వర్షాలు కురిశాయి.

ఎత్తయిన ప్రాంతాల్లో భారీ హిమపాతం

ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. ఖద్రాలాలో 40.6 సెం.మీ., గోండ్లా 36 సెం.మీ., సాండ్‌హోల్ 31.2 సెం.మీ., కుకుమ్సేరి 28.3 సెం.మీ. మంచు పడింది. మనాలిలో 28 సెం.మీ., కల్పాలో 17.7 సెం.మీ. హిమపాతం నమోదవగా, శిమ్లాలో సుమారు 4 సెం.మీ. మంచు కురిసింది.

పిడుగులు, వడగళ్ల వాన

ఈ వాతావరణ పరిస్థితులతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, వడగళ్ల వానలు కురిశాయి. శిమ్లా, కాంగ్రా, భుంటర్, సుందర్‌నగర్ పరిసరాల్లో ఉరుములు వినిపించగా, శిమ్లా, జాట్టన్ బ్యారేజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. కుఫ్రీలో గంటకు 94 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచగా, రెక్కాంగ్ పియోలో 72 కిలోమీటర్ల వేగం నమోదైంది. ఉనా, మనాలి, మండీ, కాంగ్రా ప్రాంతాల్లో తీవ్ర చలి పరిస్థితులు నెలకొన్నట్లు ఐఎండీ తెలిపింది. కల్పాలో పొగమంచు కారణంగా దృశ్యమానత సుమారు 500 మీటర్లకు తగ్గింది.

జనజీవనం అస్తవ్యస్తం

మనాలిలో ఈ సీజన్‌లో ఇప్పటివరకు సుమారు 36 అంగుళాల మంచు కురిసింది. దీని వల్ల ట్రాఫిక్ జామ్‌లు, విద్యుత్‌, తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై బ్లాక్ ఐస్ ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

ఆరెంజ్ అలర్ట్ జారీ

భారీ హిమపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరింత మంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో పర్యాటకుల రాక పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో హోటళ్ల ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరింది. లాహౌల్–స్పితి జిల్లాలో 292 రహదారులు మంచు కారణంగా మూసుకుపోయాయి. మనాలిలో 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శిమ్లా, కుల్లు ప్రాంతాల్లోనూ రహదారులు మూసుకుపోయి పర్యాటకులు చిక్కుకుపోయారు. కుఫ్రీ–నార్కండా మధ్య జాతీయ రహదారి–5 (హిందుస్థాన్–టిబెట్ రోడ్) పలుచోట్ల మంచు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వాతావరణ పరిస్థితులు పశ్చిమ దిశ నుంచి వచ్చిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం వల్లేనని ఐఎండీ తెలిపింది. జనవరి 30 రాత్రి నుంచి మరో కొత్త వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వర్షం, మంచు, దట్టమైన పొగమంచు, చలిగాలులు కొనసాగవచ్చని హెచ్చరించింది. ప్రజలు, పర్యాటకులు ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

రాజౌరిలో భారీ హిమపాతం

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో కురిసిన భారీ హిమపాతం కోట్రాంకా , పీర్ పంజాల్ పర్వత శ్రేణులను శీతాకాల స్వర్గధామంగా మార్చింది. నాలుగు నుంచి ఐదు రోజులుగా కొనసాగుతున్న మంచు వర్షం స్థానికులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇది గత 25 ఏళ్లలోనే అత్యధిక హిమపాతంగా స్థానికులు చెబుతున్నారు. మంచు వర్షం ఆనందాన్ని పంచినప్పటికీ, కొన్ని సవాళ్లను కూడా తెచ్చిందని అధికారులు తెలిపారు. కోట్రాంకా అదనపు డిప్యూటీ కమిషనర్ దిల్‌మీర్ చౌధరి మాట్లాడుతూ, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితులు లేవని తెలిపారు. భారీ హిమపాతం కారణంగా రాజౌరి–కోట్రాంకా–బుధాల్ రహదారి మూసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రవాణా తీవ్రంగా అంతరాయం పొందింది.

వ్యవసాయానికి లాభం

ఈ హిమపాతం వల్ల స్థానిక వ్యవసాయం, ఉద్యానవనాలకు మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ మంచు కరిగి నీటి వనరులు నిండుతాయి. పంటలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడో రోజున చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించాల్సి ఉందని దిల్‌మీర్ చౌధరి తెలిపారు.

ప్రజలకు హెచ్చరిక

మంచు చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు అధికారులు సూచించారు. అవలాంచ్‌కు గురయ్యే ప్రాంతాలకు వెళ్లకుండా, అవసరం లేని ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు ప్రత్యేక నంబర్ అందుబాటులో ఉంది. మరిగించిన నీటిని తాగండి, తగిన జాగ్రత్తలు పాటించండి. మంచు విరివిగా కురవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.

పునరుద్ధరణ చర్యలు

మంచు తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) భారీ యంత్రాలు, సిబ్బందిని రంగంలోకి దించింది. అంతరాయాలు ఉన్నప్పటికీ, పర్యాటకులు ఈ మంచును ఆస్వాదిస్తూ, కాశ్మీర్ లోయలోని అనుభూతితో దీన్ని పోలుస్తున్నారు.