
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా ఆర్కీ మార్కెట్‌లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు భావిస్తున్నారు. ఆర్కీ తహసీల్దార్, రెవెన్యూ అధికారి విపిన్ వర్మ మాట్లాడుతూ మంటల తీవ్రతను, శిథిలాల పరిస్థితిని పరిశీలిస్తే లోపల ఉన్న వారు ఎవ్వరూ బతికి ఉండే అవకాశం కనిపించడం లేదని తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లభించిన కొన్ని మృతదేహ భాగాల గుర్తింపు కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండు ఎర్త్‌మూవర్ యంత్రాలను మోహరించాం. ఇప్పటివరకు కొన్ని మృతదేహాలను వెలికితీశాం. అవి ఇంకా గుర్తించబడలేదు. స్థానిక సమాచారం ప్రకారం, ఇక్కడ నివసిస్తున్న రెండు కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు ఐదు మృతదేహ భాగాలు లభించాయని విపిన్ వర్మ తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్, టీమ్ ఇన్‌చార్జ్ భాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ శోధన, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అందరూ లభించే వరకు ఆపం. ప్రస్తుతం ఎవరు బతికే ఉన్నారా లేదా అనేది చెప్పడం కష్టమని అన్నారు. సోమవారం తెల్లవారుజామున 2 నుంచి 2:30 గంటల మధ్య ఈ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించి అనేక దుకాణాలు, పక్కనే ఉన్న భవనాలను పూర్తిగా దహనం చేశాయి. దీంతో అగ్నిమాపక దళాలు, ఎస్డీఆర్ఎఫ్ , హోం గార్డులు, స్థానిక యంత్రాంగం భారీగా సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో సుమారు 12 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి జేసీబీ యంత్రాలు, అనేక ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించారు. స్థానిక అగ్నిమాపక అధికారి ఆర్‌కే శర్మ మాట్లాడుతూ సుమారు 10 వాహనాల ద్వారా నీటిని పిచికారీ చేశాం. ఆరు ఫైర్ టెండర్లను మోహరించాం. ఉదయం 6:30 గంటల నాటికి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాం. నేపాలి వంశానికి చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారని సమాచారం ఉందని తెలిపారు.
సీఎం దిగ్ర్బాంతి
సోలాన్ జిల్లా ఆర్కి మార్కెట్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారితో పాటు మరో తొమ్మిది మంది మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా పరిపాలన పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. అధికారిక ప్రకటన ప్రకారం ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే సీఎం సుఖు సోలాన్ డిప్యూటీ కమిషనర్‌కు తక్షణమే సహాయక, రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్కి ఫైర్ సర్వీస్ వాహనాలతో పాటు, శిమ్లా జిల్లా బల్యూగంజ్, సోలాన్ జిల్లా బనల్గీ, అలాగే అంబూజా సిమెంట్ కంపెనీ నుంచి అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించారు.
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. ఈ ఘటన స్థలంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అవస్థీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని ఆర్కి సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారికి అవసరమైన సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మృతిచెందిన చిన్నారి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కూడా సీఎం ఆదేశించారు.ఈ సందర్భంగా సీఎం సుఖు ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆర్కి మార్కెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత హృదయ విదారకమైనది. ఈ ప్రమాదంలో ఓ ఇంత మంది మృతి చెందడం మనసును కలచివేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో నా ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలతో ఉంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ అపార దుఃఖాన్ని తట్టుకునే బలం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
