Let's talk: editor@tmv.in
హిమయని పూరిపై తప్పుడు పోస్టులు తొలగించండి: ఢిల్లీ హైకోర్టు

హిమయని పూరిపై తప్పుడు పోస్టులు తొలగించండి: ఢిల్లీ హైకోర్టు

Pinjari Chand
18 మార్చి, 2026

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పూరి కుమార్తె హిమయని పూరిని అమెరికన్ నేరస్తుడు జెఫ్రీ ఎఫ్‌స్టీన్‌తో అనుసంధానిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి మిని పుష్కరణ విచారణ సందర్భంగా ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, సంబంధిత పోస్టులను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. యూజర్లు తొలగించకపోతే, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు స్వయంగా వాటిని బ్లాక్ చేయాలని స్పష్టం చేశారు. హిమయని పూరి పిటిషన్‌పై కోర్టు ప్రిమ ఫేసి ఆమె వాదనలో బలం ఉందని అభిప్రాయపడింది. ఈ దుష్ప్రచారం కొనసాగితే ఆమెకు పూడ్చలేని నష్టం కలగవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. హిమయని పూరి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ , ఆమె ఒక అంతర్జాతీయ ఫైనాన్స్ నిపుణురాలని, ఆరోపణలు పూర్తిగా తప్పుడు, దురుద్దేశపూర్వకమని తెలిపారు. సోషల్ మీడియాలో సమన్వయంతో ‘ఆర్గనైజ్డ్ అటాక్’ జరిగినట్లు కోర్టుకు వివరించారు. పిటిషన్‌లో ఫిబ్రవరి 22 నుంచి ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డిన్ వంటి వేదికలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. తనను జెఫ్రీ ఎఫ్‌స్టీన్‌ తో వ్యాపార లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు చూపించడం పూర్తిగా అసత్యమని హిమయని పూరి స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారం వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని చెబుతూ రూ.10 కోట్ల పరిహారం, నిర్బంధ క్షమాపణలు కోరారు.

ఈ కేసులో గ్లోబల్ స్థాయిలో కంటెంట్ బ్లాకింగ్ అంశంపై కూడా వాదనలు వినిపించాయి. మెటా ఫ్లాట్‌ఫామ్స్‌ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అరవింద్‌ డటర్‌‌ , గ్లోబల్ బ్లాకింగ్ సాధారణ ప్రక్రియ కాదని, ఈ అంశం ఇప్పటికే హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు పెండింగ్‌లో ఉందని తెలిపారు. దీంతో కోర్టు తాత్కాలికంగా భారత్ పరిధిలోనే బ్లాకింగ్ ఆదేశాలను పరిమితం చేసింది. ఇక ప్రత్యర్థి తరఫు న్యాయవాది, తన వీడియో ‘జర్నలిస్టిక్ ఫ్రీడమ్’ పరిధిలో వస్తుందని వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, పూర్తి విచారణ అవసరమని పేర్కొని సంబంధిత యూజర్లు, సోషల్ మీడియా సంస్థలకు సమన్లు జారీ చేసింది. జెఫ్రీ ఎఫ్‌స్టీన్‌కు సంబంధించిన లైంగిక అక్రమ రవాణా కేసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వేల పేజీల పత్రాలు (‘ఎఫ్‌స్టీన్‌ ఫైల్స్’) నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని హిమయని పూరి పునరుద్ఘాటించారు.

హిమయని పూరిపై తప్పుడు పోస్టులు తొలగించండి: ఢిల్లీ హైకోర్టు - Tholi Paluku