
హిమంత భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయి: కాంగ్రెస్
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది. అయితే ఈ ఆరోపణలను సీఎం శర్మ పూర్తిగా ఖండిస్తూ అవి దుష్ప్రచారం, కల్పితమని కొట్టిపారేశారు. ఆదివారం కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్‌ఖేరా న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పత్రాలను చూపిస్తూ ఈ ఆరోపణలు చేశారు. అస్సాం ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో తన భార్య విదేశీ ఆస్తుల వివరాలను శర్మ వెల్లడించలేదని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుని ఆయన నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఖేరా ప్రకారం, శర్మ భార్య రింకి భుయాన్ శర్మకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, ఈజిప్ట్ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. అలాగే దుబాయ్‌లో డబుల్ ఆస్తులు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆయన విమర్శించారు. ఇక అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేసి డబ్బు దాచారని కూడా కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు.
పరువు నష్టం కేసులు వేస్తాం
అయితే ఈ ఆరోపణలను శర్మ తీవ్రంగా ఖండించారు. అస్సాం ఎన్నికల్లో చారిత్రాత్మక విజయానికి బీజేపీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నిరాధార ఆరోపణలకు దిగిందని అన్నారు. ప్రచారం చేస్తున్న పత్రాల్లో అనేక కల్పితాలు ఉన్నాయని, అవి డిజిటల్ మానిప్యులేషన్ ద్వారా తయారు చేసినవని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై తాను, తన భార్య 48 గంటల్లో క్రిమినల్, సివిల్ పరువునష్టం కేసులు వేస్తామని శర్మ తెలిపారు. ఇదే విషయంపై స్పందించిన రింకీ భూయాన్ శర్మ కూడా ఆరోపణలను ఖండించారు. తప్పుడు పాస్‌పోర్ట్ చిత్రాలను ప్రచారం చేస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యరోపణలు మరింత తీవ్రంగా మారాయి.
