Let's talk: editor@tmv.in
హిమంత బిశ్వ శర్మ తలలో ట్యూబ్‌లైట్ ఉంది: ఓవైసీ

హిమంత బిశ్వ శర్మ తలలో ట్యూబ్‌లైట్ ఉంది: ఓవైసీ

Pinjari Chand
12 జనవరి, 2026

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ‘హిందూ ప్రధాని’ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మకు రాజ్యాంగం అర్థం కావడం లేదని ఆరోపిస్తూ ఆయన తలలో ట్యూబ్‌లైట్ ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఓవైసీ చేసిన ‘హిజాబ్ ధరించిన కుమార్తె ఒక రోజు దేశ ప్రధాని అవుతుంది’ అన్న వ్యాఖ్యకు ప్రతిస్పందనగా హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఎవరికైనా ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, భారత్ హిందూ దేశం కావడంతో హిందూ వ్యక్తే ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకీ లేదు. ఎవరైనా ప్రధాని కావచ్చు. కానీ భారత్ ఒక హిందూ దేశం, హిందూ నాగరికత. అందువల్ల భారత ప్రధాని ఎప్పటికీ హిందూ వ్యక్తే అవుతాడని మేము నమ్ముతున్నాం, దానిపై మాకు పూర్తి విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఓవైసీ తీవ్రంగా స్పందించారు.

అసోం ముఖ్యమంత్రిది సంకుచితమైన ఆలోచన

మీడియాతో ఓవైసీ మాట్లాడుతూ ఆయన తలలో ట్యూబ్‌ లైట్ ఉంది. ఆయన రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. రాజ్యాంగంలో ఇలా ఎక్కడ రాసి ఉంది? పాకిస్తాన్ రాజ్యాంగంలో మాత్రమే ఒకే ఒక సముదాయానికి చెందిన వ్యక్తే ప్రధాని, రాష్ట్రపతి అవుతాడని ఉంది. మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన హిమంత బిశ్వ శర్మ కంటే ఎంతో తెలివైనవారు, విద్యావంతులని అన్నారు. దురదృష్టవశాత్తూ రాజ్యాంగాన్ని, దాని ఆత్మను అర్థం చేసుకోని వాళ్లు ఈ దేశం ఒక్క సముదాయానికి మాత్రమే చెందినదని భావిస్తున్నారు. ఈ దేశం దేవుడిని నమ్మని వాళ్లకూ చెందుతుందన్నదే భారతదేశ సౌందర్యం. అసోం ముఖ్యమంత్రికి సంకుచితమైన ఆలోచన ఉంది. అందుకే ఇలాంటి చిన్నచిన్న, తుచ్ఛమైన వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు.

ఇదే అంశంపై శుక్రవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఓవైసీ, భారత రాజ్యాంగం కల్పించిన సమగ్రత (ఇన్‌క్లూసివిటీ)ను ప్రస్తావించారు. పాకిస్తాన్ రాజ్యాంగంలో అలాంటి స్వేచ్ఛ లేదని ఆయన అన్నారు. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఒకే మతానికి చెందిన వ్యక్తే ఆ దేశ ప్రధాని కావచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలో ఏ పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చు. ఒక రోజు హిజాబ్ ధరించిన కుమార్తె ఈ దేశానికి ప్రధాని అవుతుందన్నది నా కల అని ఓవైసీ అన్నారు.