
హింసాత్మక చర్యలు తెలంగాణలో అంగీకార్యం కాదు: కేటీఆర్
సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల పెట్టి నివాళులు అర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ వారిని అన్ని విధాలా మద్దతు ఇస్తుందనే భరోసా కూడా కల్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో మాత్రమే దాడులకు పాల్పడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే, రెండేళ్లలో అద్భుతాలు చేసి ఉంటే.. కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలంటే కాంగ్రెస్ ఇంతగా ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ప్రజలకు అందజేశామని చేప్పుతూ ఎన్నికల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్నా, మేము ప్రజల కోసం ఆలోచించాము. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండకూడదు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ దిక్కుమాలిన రాజకీయాలు చేయడం ద్వారా ఏం లాభం ఉంది. ప్రజలకు మంచి చేయడంలో దృష్టి పెట్టాలని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితులు తెలంగాణలో ముందు ఉండలేదని, ఇది సరైన పద్ధతి కాదని కూడా కేటీఆర్ చెప్పారు. మల్లయ్య మరణం వెంటనే కుటుంబాన్ని పరామర్శించలేకపోయినందుకు వ్యక్తిగతంగా దుఃఖం వ్యక్తం చేశారు.
గులాబీ సైనికులకు అభినందనలు
అదనంగా, మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, భవిష్యత్తులో వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు తట్టుకొని, సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను బీఆర్ఎస్ గెలిచిన గులాబీ సైనికులకు కేటీఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు.ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
