Let's talk: editor@tmv.in
హింసాత్మకంగా నోయిడా కార్మికుల ఆందోళన
హింసాత్మకంగా నోయిడా కార్మికుల ఆందోళన

హింసాత్మకంగా నోయిడా కార్మికుల ఆందోళన

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన నిరసనలు నోయిడాలో సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, రాళ్లు రువ్వడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని పోలీసులు తెలిపారు. ప్రధానంగా నోయిడాలోని ఫేజ్–2, సెక్టర్ 60 ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. ఉదయం రద్దీ సమయాల్లో జరిగిన నిరసనలతో ట్రాఫిక్ పూర్తిగా స్థంభించి, వేలాది మంది ప్రయాణికులు రహదారులపై ఇరుక్కుపోయారు. నోయిడా–ఢిల్లీ సరిహద్దు వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు కనిపించాయి.

అధికారుల ప్రకారం వివిధ పరిశ్రమల యూనిట్లకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఉదయం కలిసి వేతన సవరణపై తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. సెక్టర్ 62, సెక్టర్ 84 ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. ఒక మదర్‌‌సన్‌ గ్రూప్‌ యూనిట్ వద్ద కూడా ఆందోళనలు జరిగినట్లు సమాచారం. ఆందోళనకారులు నేషనల్‌ హైవే 9ను కూడా బ్లాక్ చేశారు. కొంతసేపటికి పరిస్థితి ఉద్రిక్తంగా మారి కొందరు నిరసనకారులు వాహనాలకు నిప్పంటించి, ఆస్తులను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నోయిడాలోని పారిశ్రామిక ప్రాంతాలన్నింటిలో భారీగా పోలీసులను మోహరించారు. సీనియర్ పోలీసు, పరిపాలన అధికారులు సంఘటన స్థలాల్లోనే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది. కార్మికులతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం. అవసరమైన చోట మాత్రమే బలప్రయోగం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అపోహలను నమ్మవద్దని ప్రజలను అధికారులు కోరారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తోందని తెలిపారు.

కార్మికులతో చర్చలు జరపండి

ఈ ఘటనకు ఒక రోజు ముందు గౌతమ్‌బుద్ధ నగర్‌‌లో కార్మిక సంక్షేమానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించింది. కార్మికులకు డబుల్ ఓవర్‌ టైమ్ చెల్లింపులు, సమయానికి జీతాలు చెల్లించడం వంటి ఆదేశాలను జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్‌ జారీ చేశారు. పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులతో నిరంతరం చర్చలు జరపాలని, ఫ్యాక్టరీ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చూడాలని కూడా అధికార యంత్రాంగం ఆదేశించింది. ఇదిలా ఉండగా నోయిడా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ప్రవేశ మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్య సరిహద్దు ప్రాంతాల్లో అదనపు పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పరిస్థితిని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.