
హింసతో భయపెడతామనుకుంటే భ్రమే : జగన్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలపై వరుసగా జరుగుతున్న అరెస్టులు, వాటి అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చాయి. గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు, కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి రాజకీయ కలకలానికి ప్రతీకగా మారాయి.
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడం తక్షణ కారణంగా మారింది. ఈ ఘటనతో గుంటూరు నగరంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. రోడ్లపై, రాంబాబు నివాసం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, కొందరు పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నేత ఇల్లు, వాహనాలపై దాడులు జరగడం ఈ మొత్తం పరిణామాలపై పోలీసు వ్యవస్థ ముందస్తు చర్యల్లో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా ఇదే సమయంలో ఆదివారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హింసను ప్రోత్సహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష ఇళ్లపై నిప్పు పెట్టి భయాన్ని సృష్టించమని అనుకోవడం భ్రమే. నిజానికి, ఈ నిప్పు మీ ప్రభుత్వానికే ఆత్మాహుతి. హింసా, అరాచకంతో ప్రజాస్వామ్యాన్ని అణచలేరు అని స్పష్టం చేసారు. ఈ ఘటనలు రాష్ట్రాన్ని ‘అడవి రాజ్యం’ వైపు నెడుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. లడ్డూ అంశం మతపరంగా సున్నితమైనదిగా మారిన వేళ, అరెస్టులు, దాడులు వంటి ఘటనలు మీడియా అజెండాను మార్చేశాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తం మీద ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాదకర సంకేతాలుగా మారుతున్నాయని తాత్కాలిక రాజకీయ లాభాల కోసం హింసకు దారితీస్తే చివరికి నష్టపోయేది ప్రజాస్వామ్య వ్యవస్థే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
