

హిందూ - ముస్లింలు నాకు సమానమే: సీఎం రేవంత్ రెడ్డి
హిందూ, ముస్లింల మధ్య నాకు ఎలాంటి వ్యత్యాసం లేదు. ఇద్దరూ నాకు రెండు కళ్లలాంటివారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూ సోదరులకు అందే సంక్షేమ ఫలాలు ముస్లింలకు కూడా సమానంగా దక్కేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన 'మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
తన దృష్టిలో హిందువులు, ముస్లింలు వేరు వేరు కాదని, మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం పేర్కొన్నారు. మైనారిటీలను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే ప్రభుత్వం 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించిన సమయంలో, మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉపాధ్యాయులుగా మారితే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తారనే అభిప్రాయంతో తాను ఉన్నానని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 2007లో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని సీఎం గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే లౌకికత్వానికి ప్రతీక అని చెప్పారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆచరణలో చూపించిందన్నారు.
మైనారిటీలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. గతంలో తెలంగాణలో పర్యటించిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలోనే కాదు, గుజరాత్‌లోనూ ఆ రిజర్వేషన్లను తొలగించి చూపాలని అప్పట్లోనే కాంగ్రెస్ సవాల్ చేసిందని, లౌకికత్వాన్ని కాపాడేందుకు సడక్ నుంచి సంసద్ (రోడ్ల నుంచి పార్లమెంట్) వరకు పోరాడుతామని పునరుద్ఘాటించారు.
మైనారిటీల సంక్షేమం & అవకాశాలు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు గెలవకపోయినా, మైనారిటీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు మహ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నానని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌లకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. సిరాజ్‌కు అవసరమైన విద్యార్హతలు లేకపోవడంతో, నిబంధనలకు మినహాయింపు ఇచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆయనకు ఉద్యోగం కల్పించామని రేవంత్ రెడ్డి వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 సహా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రూప్-1 పరీక్ష పేపర్లు మార్కెట్‌లో విక్రయించారంటూ ఆరోపించారు. గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీకి అర్హత, అనుభవం ఉన్నవారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించాల్సి ఉండగా, గతంలో అనామకులను నియమించారని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, నిపుణులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని సీఎం తెలిపారు. పరీక్షలు, నియామకాలను అడ్డుకునేందుకు అనేక అవరోధాలు సృష్టించినప్పటికీ, అభ్యర్థులను కుటుంబ సభ్యులుగా భావించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సమర్థులైన న్యాయవాదులతో న్యాయపోరాటం చేసి నియామక ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు.
విద్యతోనే భవిష్యత్తును మార్చుకోవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి సారించడంతో పాటు ఆ తర్వాత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యాలు ఉన్న వారికి దేశంలోనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ విస్తృత ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు.
చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఉద్యోగాలు, జాతీయ స్థాయి పరీక్షల్లో విజయాలు సాధించిన మైనారిటీ యువత తమ ప్రతిభను సమాజం, రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని సీఎం కోరారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, టీజీ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
