
హిందూ మహా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం
హిందూ మహాసముద్రంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్.సి.ఎస్) వెల్లడించింది. ఆదివారం ఉదయం 8:10 గంటల సమయంలో సముద్ర ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం 1.806 ఉత్తర అక్షాంశం, 94.924 తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైందని ఎన్.సి.ఎస్ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించింది.
లోతు తక్కువైతే ముప్పు ఎక్కువే!
సాధారణంగా లోతులో వచ్చే భూకంపాల కంటే, ఉపరితలానికి దగ్గరగా (తక్కువ లోతులో) వచ్చే భూకంపాలే అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమి అంతర్భాగంలో తక్కువ లోతులో కదలికలు సంభవించినప్పుడు, ఆ ప్రకంపనలు ఉపరితలానికి చేరుకోవడానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీనివల్ల భూమిపై తీవ్రమైన కుదుపులు ఏర్పడి, భవనాలు కుప్పకూలడం వంటి భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
గుర్తుకు తెస్తున్న 2004 నాటి చేదు జ్ఞాపకాలు
తాజా భూకంపం నేపథ్యంలో 2004లో సంభవించిన 'బాక్సింగ్ డే' సునామీ భీభత్సాన్ని మరోసారి గుర్తుకు తెస్తోంది. సరిగ్గా డిసెంబర్ 26, 2004న ఇండోనేషియాలోని సుమత్రా పశ్చిమ తీరంలో 9.2 నుంచి 9.3 తీవ్రతతో సంభవించిన మెగాథ్రస్ట్ భూకంపం ప్రపంచాన్నే వణికించింది. బర్మా ప్లేట్, ఇండియన్ ప్లేట్ మధ్య ఏర్పడిన భారీ పగుళ్ల కారణంగా వచ్చిన ఈ భూకంపం, చరిత్రలోనే అత్యంత వినాశకరమైన సునామీకి దారితీసింది.
నాటి భూకంపం కారణంగా సుమారు 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తులో విరుచుకుపడిన రాకాసి అలలు హిందూ మహాసముద్రం అంచున ఉన్న 14 దేశాలను అతలాకుతలం చేశాయి. ఈ మహా విపత్తులో ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్, శ్రీలంక, థాయ్‌లాండ్‌తో పాటు భారత్‌లోని తమిళనాడు తీర ప్రాంతాల్లో సుమారు 2,27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. 21వ శతాబ్దంలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా నిలిచిన ఆ ఘటన, తీరప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను, వాణిజ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ప్రస్తుత భూకంపం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, సముద్ర గర్భంలో కదలికల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
