
హిందూపురం వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడి
హిందూపురంలోని వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంపై దాడికి టిడిపి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులే కారణమని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోను శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఆయన ఈ “హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా చేసిన దెబ్బ” అని మండిపడ్డారు.
పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నదని జగన్ పేర్కొన్నారు. “వారి మౌనం యదార్థంలో నిర్లక్ష్యం కాదు. రాష్ట్ర చట్ట వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే సంకేతం ఇది” అని విమర్శించారు.
హిందూపురం ఘటన టీడీపీ పాలనలో గూండాగిరికి ప్రోత్సాహం లభిస్తోందని, ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు హింసను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. “ప్రతిపక్షం కనీస ప్రజాస్వామ్య హక్కులను కాపాడలేని ప్రభుత్వం పాలన గురించి మాట్లాడగల నైతిక హక్కు లేదు” అని జగన్ ఎద్దేవా చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ కూడా టిడిపి బెదిరింపులు, దాడులు తమను అణగదొక్కలేవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై టిడిపి నుంచి ఇప్పటివరకు స్పందన లభించలేదు.
