Let's talk: editor@tmv.in
హిందీయేతర భాషలకు సాహిత్య పురస్కారాలు:సీఎం స్టాలిన్

హిందీయేతర భాషలకు సాహిత్య పురస్కారాలు:సీఎం స్టాలిన్

Pinjari Chand
19 జనవరి, 2026

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదివారం హిందీయేతర భాషలతో సహా ఏడు భారతీయ భాషలకు వార్షిక సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య అకాడమీ అవార్డుల్లో కేంద్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చే ఈ అవార్డుకు ‘సెమ్మొజి ఇల్లకియ విరుదు ’శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం) అని పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రతి భాషకు రూ.5 లక్షల నగదు బహుమతి ఉంటుంది.

మొదటి దశలో అవార్డులు పొందే భాషలు

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ, మరాఠీ ఉన్నాయి. చెన్నై అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన (సీఐబీఎఫ్–2026) ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన స్టాలిన్, ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన రద్దవ్వడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. దీనికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జోక్యమే కారణమని ఆయన ఆరోపించారు.కళలు, సాహిత్య అవార్డుల్లో కూడా రాజకీయ జోక్యం ప్రమాదకరమని అన్నారు. ఈ పరిస్థితుల్లో పలువురు రచయితలు, సాహిత్య సంస్థల ప్రతినిధులు తనను కలిసి సరైన ప్రత్యామ్నాయ చర్య తీసుకోవాలని కోరారని స్టాలిన్ చెప్పారు.

జాతీయ స్థాయి అవార్డులు

ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం తరఫున జాతీయ స్థాయి సాహిత్య అవార్డులు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అవార్డు ఎంపిక ప్రక్రియను స్వతంత్ర నిపుణులకే అప్పగిస్తామని, ప్రతి భాషకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కమిటీల్లో పేరొందిన రచయితలు సభ్యులుగా ఉంటారని చెప్పారు.

అనువాదాల ప్రాధాన్యత

ద్రవిడియన్ మోడల్ ప్రభుత్వం జ్ఞానాన్ని ప్రతి ఇంటికి చేర్చే దిశగా చర్యలు తీసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో అనువాదాలు, కాపీరైట్ మార్పిడులకు పెద్దపీట వేశామని తెలిపారు. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విజేత, కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ విజయం అనువాదాల ప్రాముఖ్యతను చాటుతోందని ఆయన అన్నారు. ఆమె రచన ‘హార్ట్ ల్యాంప్’ ఇంగ్లిష్‌లోకి అనువదించినందువల్లే ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందిన, మైనారిటీ వర్గానికి చెందిన, సామాజిక న్యాయ దృష్టికోణం కలిగిన మహిళా రచయిత్రి ఈ వేడుకకు రావడం గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు.

పుస్తకాలు విడుదల

ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మొత్తం 84 పుస్తకాలను విడుదల చేశారు. తమిళనాడు పాఠ్యపుస్తక సంస్థకు చెందిన 44 పుస్తకాలు, పబ్లిక్ లైబ్రరీకి చెందిన 40 పుస్తకాలు ఉన్నాయి. తమిళాన్ని ప్రపంచానికి తీసుకెళ్లడం – ప్రపంచాన్ని తమిళానికి తీసుకురావడం అనే లక్ష్యంతో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించారు. 2026లో జరిగిన నాలుగో ఎడిషన్‌కు ‘సంస్కృతుల మధ్య సంభాషణ’ అనే థీమ్ ఉంది. ఈ ఏడాది ఈ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో 100కు పైగా దేశాలు పాల్గొన్నాయి. 102 దేశాల మధ్య 1,800కి పైగా ఒప్పందాలు కుదిరాయి. తమిళం నుంచి ఇతర భాషలకు 1,273 అనువాద ఒప్పందాలు, ఇతర భాషల నుంచి తమిళానికి 260 ఒప్పందాలు జరిగాయి. ఈ ప్రదర్శన జనవరి 16 నుంచి 18 వరకు కళైవాణర్ అరంగంలో జరిగింది.

ద్రవిడియన్ మోడల్ 2.0

రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే అది “ద్రవిడియన్ మోడల్ 2.0” అవుతుందని స్టాలిన్ అన్నారు. అప్పుడు అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీకే శేఖర్ బాబు, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, చెన్నై మేయర్ ఆర్.ప్రియా తదితరులు పాల్గొన్నారు.