
హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదు - రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
బీసీ హాస్టళ్లు, ఎంజేపీ బీసీ గురుకులాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు. ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను హాస్టళ్లలో విడిచిపెట్టి వెలుతున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ బిడ్డలకు ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు. హాస్టళ్లలో అక్రమాలను సహించేది లేదని హెచ్చరించారు.
ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కడప జిల్లా పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిపై ఆరోపణలు రుజువు కావడంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. ఆమె అక్రమాలకు పరోక్షంగా సహకరించిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణిని హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా పులివెందులకు చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ తో విచారణ చేపట్టామన్నారు. ఆ విచారణలో జ్యోతిపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో, ఆమె విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించామన్నారు. ఆ ఆదేశాలకనుగుణంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి.జ్యోతిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. జ్యోతి అక్రమాలను అడ్డుకట్ట వేయకుండా, పరోక్షంగా ఆమెకు సహకరించినట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అంజల దేవీని విధుల నుంచి రిలీవ్ చేస్తూ విజయవాడ హెడ్డాఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
