
హార్వర్డ్ వేదికగా రేవంత్ రెడ్డి వర్చువల్ ప్రసంగం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నిర్వహించనున్న మొట్టమొదటి కృత్రిమ మేధ(ఏఐ) సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. మార్చి 27న జరగనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు.
వర్చువల్ పద్ధతిలో భాగస్వామ్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కారణంగా స్వయంగా బోస్టన్‌కు వెళ్లడం లేదు. దీనికి బదులుగా, ఆయన వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్ కోర్స్ చేసిన రేవంత్ రెడ్డి కోసం నిర్వాహకులు ఈ ప్రత్యేక ఏర్పాటు చేయడం విశేషం.
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ విభాగం ఈ అంతర్జాతీయ సింపోజియంను నిర్వహిస్తోంది. వేగంగా మారుతున్న గ్లోబల్ ఏఐ రంగంపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ జెరెమీ వైన్‌స్టెయిన్ ప్రారంభోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. హార్వర్డ్‌కు చెందిన పలు థింక్ ట్యాంకులు, టెక్నాలజీ విభాగాల సహకారంతో ఇది జరుగుతోంది.
చర్చించబోయే కీలక అంశాలు
ఈ సింపోజియం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వివిధ రంగాలపై ఎలా ఉందనే అంశాలపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా పాలన, ఆర్థిక పోటీతత్వం, భౌగోళిక రాజకీయాలు, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతమైన చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏఐఅభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తరుణంలో సీఎం ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
సదస్సులో భాగంగా పలు ఆసక్తికర అంశాలపై ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రేసు’, ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఏఐ’, ‘విద్య, ఉపాధి భవిష్యత్తు’ వంటి అంశాలపై ప్రపంచ స్థాయి నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు గ్లోబల్ టెక్, పాలసీ దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఎక్స్ ప్రైజ్ సీఈఓ అనూషె అన్సారీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఇల్లంగో పచ్చముత్తు, బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన లాండ్రీ సిగ్నే వంటి ప్రముఖులు ఈ చర్చాగోష్టుల్లో తమ గళాన్ని వినిపించనున్నారు.
