
హార్వర్డ్ లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల అభినందనలు
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనెడీ ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ' ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో నిర్వహించిన ఆరు రోజుల నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మంగళవారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని ముఖ్యమంత్రిని సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి నాయకత్వ కార్యక్రమాన్ని పూర్తి చేయడం రాష్ట్రానికి గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి మంత్రులు, పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పోటీ లేదని, దాదాపు 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా మద్దతు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
