
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌తో తెలంగాణ భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఒక కీలక ముందడుగు వేశారు. సీఎం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 6 రోజులపాటు నిర్వహిస్తున్న నాయకత్వ శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటూ, అక్కడి ప్రతిష్ఠాత్మక కెన్నెడీ స్కూల్‌తో సహకారానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో సమావేశమై, విద్యా రంగంలో పరస్పర భాగస్వామ్యంపై చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ ఎక్స్ వైస్ ప్రొవోస్ట్, హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టింగ్లీతో పాటు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ జెరెమీ వెయిన్‌స్టీన్‌ను కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ పత్రాన్ని వారికి అందజేశారు. రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కెన్నెడీ స్కూల్‌తో సహకారం అవసరమని సీఎం కోరగా, హార్వర్డ్ అధికారులు దీనికి సానుకూలంగా స్పందించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యా నాణ్యతను విస్తృత స్థాయిలో మెరుగుపరచేందుకు అవసరమైన విధానాలు, ఆధునిక నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి ఆర్థిక వృద్ధిపై చూపే ప్రభావం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఇన్ ది 21వ శతాబ్దం’ అనే శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జనవరి 25 నుంచి 30 వరకు సాగనున్న ఈ కోర్సులో తరగతులు, అసైన్‌మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తిచేసిన అనంతరం ఆయనకు హార్వర్డ్ నుంచి కోర్సు సర్టిఫికెట్ అందనుంది. భారతదేశంలో విధుల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం విశేషం.
తెలంగాణ సంస్థలకు ప్రయోజనాలు
హార్వర్డ్‌తో ఈ సమన్వయం వల్ల తెలంగాణలోని విద్యా సంస్థలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుంది.ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్లోబల్ పాలనా పద్ధతుల్లో శిక్షణ. ముఖ్యంగా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థలకు హార్వర్డ్ పరిశోధనలు, పాఠ్యప్రణాళికలు అందుబాటులోకి రావడం వల్ల గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
