Let's talk: editor@tmv.in
హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలకు హెచ్చరిక

హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలకు హెచ్చరిక

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అమెరికా జెండా కలిగిన వాణిజ్య నౌకలకు అమెరికా కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌కు చెందిన ప్రాంతీయ జలాలకు సాధ్యమైనంత దూరంగా ప్రయాణించాలని, ఆ దేశ దళాలకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలని అమెరికా మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం హెచ్చరించింది. ఇరాన్ దళాలు నౌకల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే బలవంతంగా ప్రతిఘటించవద్దని, అయితే అది వారి చర్యకు అంగీకారం తెలిపినట్లు కాదని సిబ్బందికి సూచించింది.

‘ఒమన్ వైపు నుంచే ప్రయాణించండి’

హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అమెరికా నౌకలు నౌకాయాన భద్రతకు విఘాతం కలగకుండా ఇరాన్ సరిహద్దులకు దూరంగా ఉండాలని వాషింగ్టన్ స్పష్టం చేసింది. తూర్పు వైపు ప్రయాణించేటప్పుడు ఒమన్ ప్రాదేశిక జలాలకు దగ్గరగా వెళ్లాలని సూచించింది. ఇటీవలే ఒమన్‌లో ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగినప్పటికీ, యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని అమెరికా "ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ చోక్‌పాయింట్"గా పరిగణిస్తోంది.

పెరుగుతున్న ఘర్షణ వాతావరణం

గతేడాది జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు గనుక ముదిరితే, సముద్ర మార్గంలో అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి చివరలో ఇరాన్ దళాలు విన్యాసాలు నిర్వహిస్తుండగా, తమ నౌకలకు దగ్గరగా వచ్చిన ఇరాన్ డ్రోన్‌ను అమెరికా కూల్చివేసింది. సరిగ్గా 1980లలో ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో నౌకలపై దాడులు జరిగినట్లే, ఇప్పుడు కూడా వాణిజ్య నౌకలు దేశాల మధ్య గొడవల్లో చిక్కుకుంటున్నాయి. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు చేస్తున్న దాడులు కూడా సముద్ర ప్రయాణాలను మరింత భయానకంగా మారుస్తున్నాయి.

అణు చర్చలు.. ట్రంప్ హెచ్చరికలు

ఇరాన్ గనుక మళ్లీ అణు ఆయుధాలు, క్షిపణుల తయారీని ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. గతంలోనే అంటే 2025 జూన్‌లో జరిగిన గొడవల సమయంలో అమెరికా ఇరాన్‌కు చెందిన మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడులు చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము కేవలం అణు అంశాలపైనే మాట్లాడతామని అంటోంది. కానీ, అమెరికా మాత్రం ఇరాన్ తయారు చేస్తున్న క్షిపణులు, అలాగే హమాస్, హెజ్బొల్లా వంటి సంస్థలకు వారు ఇస్తున్న మద్దతుపై కూడా తేల్చాలని పట్టుబడుతోంది. ముఖ్యంగా అణు బాంబు తయారీకి అవసరమయ్యే 'యురేనియం శుద్ధి' చేయడం తమ హక్కు అని ఇరాన్ వాదిస్తుంటే, అటువంటి పనులేవీ చేయకూడదని అమెరికా కఠినంగా చెప్తోంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారని, తెలివైన నిర్ణయం తీసుకుంటే అది ఇరాన్‌కు కూడా మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.

హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలకు హెచ్చరిక - Tholi Paluku