
‘హార్ముజ్’ ఉద్రిక్తతల మధ్య ముంబై చేరిన తొలి చమురు నౌక
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ ఆధీనంలోని హార్ముజ్ జలసంధిని దాటుకుంటూ 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురుతో ‘షెన్‌లాంగ్’ అనే నౌక బుధవారం సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకుంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌కు ముడిచమురుతో వచ్చిన తొలి నౌక ఇదే కావడం విశేషం. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి బయలుదేరిన ఈ నౌక, నిఘా నేత్రాలకు దొరకకుండా తన సిగ్నల్ వ్యవస్థను ఆపివేసి మరీ గమ్యాన్ని చేరుకుంది. ఇందులో ఉన్న ముడిచమురును ముంబైలోని మాహుల్ రిఫైనరీలకు తరలించనున్నారు.
భారత నౌకలకు ఇరాన్ వెసులుబాటు!
వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు కచ్చితంగా తమ అనుమతి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. లేనిపక్షంలో దాడులు తప్పవని రియర్ అడ్మిరల్ అలీరెజా తంగ్‌సిరి స్పష్టం చేశారు. ఇప్పటికే తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన ‘ఎక్స్‌ప్రెస్ రోమ్’, ‘మయూరి నారీ’ నౌకలపై దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సంబంధం లేని నౌకలను అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. భారతీయ జెండాతో ప్రయాణించే నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని కల్పిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 28 భారత నౌకలు, సుమారు 778 మంది భారతీయ నావికులు ఉన్నారని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇరాక్ తీరంలో భారత నావికుడి మృతి
ఒకవైపు ఊరట లభిస్తున్నా, మరోవైపు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇరాక్‌లోని బస్రా సమీపంలో అమెరికా యాజమాన్యానికి చెందిన ‘సేఫ్‌సీ విష్ణు’ అనే చమురు ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ నౌకలోని మరో 15 మంది భారతీయులను సురక్షితంగా తరలించినట్లు బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. హార్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్ తన చమురు పోర్టులను తాత్కాలికంగా మూసివేసింది. ఈ దాడుల తీవ్రతను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఇప్పటికే భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం
ప్రపంచ ముడిచమురు వినియోగంలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధి మూతపడితే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. భారత రాయబార కార్యాలయాలు, షిప్పింగ్ కంపెనీలు, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారతీయ నావికుల భద్రతకు పెద్దపీట వేస్తోంది. మరోవైపు ఇరాన్ మైన్లను అమర్చకుండా అడ్డుకునేందుకు అమెరికా సైన్యం సిద్ధమవుతుండటంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత రాజుకుంటున్నాయి.
