
హార్దిక్, అభిషేక్ గాయాలపై బౌలింగ్ కోచ్ కామెంట్
పాకిస్థాన్‌తో ఆదివారం జరగనున్న ఆసియా కప్ హై-వోల్టేజ్ ఫైనల్‌కు ముందు టీమిండియాలో నెలకొన్న గాయాల ఆందోళన తొలగిపోయింది. శ్రీలంకతో జరిగిన ఉత్కంఠభరిత సూపర్-4 మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ మైదానం వీడటంతో వారి ఫిట్‌నెస్‌పై తీవ్ర సందేహాలు తలెత్తాయి. వీరిద్దరూ గాయపడ్డారని, పాక్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడటం కష్టమేననే వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరి గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇవి తీవ్రమైన గాయాలు కావని, కేవలం కండరాలు పట్టేయడం (క్రాంప్స్) మాత్రమేనని స్పష్టం చేశాడు. హార్దిక్ కండరాలు పట్టేయడంతోనే మరో ఓవర్ వేయలేదన్నాడు. అభిషేక్ శర్మ సైతం క్రాంప్స్‌లో బాధపడుతున్నట్లుగా వెల్లడించాడు. దీంతో అభిమానులు, జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌కు దిగిన వెంటనే హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తొలి ఓవర్ పూర్తయ్యాక మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత హార్దిక్ తిరిగి ఫీల్డింగ్‌కు రాలేదు. బ్యాటింగ్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఫీల్డింగ్ సమయంలో తొమ్మిదో ఓవర్‌లో ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డాడు. వీరిద్దరూ మైదానం వీడటం జట్టులో ఆందోళన కలిగించింది.
అభిషేక్ బాగానే ఉన్నాడు: మోర్కెల్
ఈ విషయంపై మోర్కెల్ మీడియా సమావేశంలో స్పష్టతనిచ్చారు. "హార్దిక్‌తో పాటు అభిషేక్ శర్మ కూడా కండరాల తిమ్మిర్లతోనే ఇబ్బంది పడ్డాడు. అభిషేక్ బాగానే ఉన్నాడు. హార్దిక్‌కు క్రాంప్స్ వచ్చాయి. అతడి ప్రస్తుత పరిస్థితిని వైద్య బృందం అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ఆయన వివరించాడు. వీరిద్దరి పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోర్కెల్ భరోసా ఇచ్చాడు. వీరిద్దరికి పెద్దగా గాయాల సమస్య ఏమీ లేదని, కేవలం కండరాలు పట్టేయడంతోనే మ్యాచ్‌లో ఇబ్బంది పడినట్లు, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఫైనల్‌కు తక్కువ సమయం ఉన్నందున, ఆటగాళ్ల రికవరీకే పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మోర్కెల్ వెల్లడించాడు.
యువ పేసర్లకు మోర్కెల్ అండ
శ్రీలంకతో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించిన యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు మోర్కెల్ అండగా నిలిచాడు. "మా జట్టులో సాకులు చెప్పే సంస్కృతిని ప్రోత్సహించం. నెట్స్‌లో ఎంత కష్టపడ్డా, మ్యాచ్ ఆడిన అనుభవం వేరు. ప్రస్తుతం వారికి కలిసి రావడం లేదు. కానీ వాళ్లిద్దరూ మ్యాచ్‌లను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాళ్లు" అంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 పరుగులు), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39 పరుగులు) రాణించారు. ఆ తర్వాత పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 పరుగులు), కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) దంచికొట్టడంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అవ్వగా సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయి 2 పరుగులు చేసింది. భారత జట్టు తొలి బంతికే 3 పరుగులు చేసి గెలిచింది.
