.jpeg)
హాయిగా.. నిదురపోరా తమ్ముడా!
ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదు అని ఒక సామెత. ప్రపంచంలో అత్యుత్తమ నిద్రగాళ్లు ఏ దేశీయులు? నిద్ర పోకుండా గుడ్లగూబల డ్యూటీ చేస్తున్న దేశం ఏదో తేలిపోయిందట. ప్రపంచంలో అత్యంత సంపన్నులెవరూ అంటే చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండే వాళ్లేనని అభిప్రాయ బేధం లేకుండా అంతా అంగీకరిస్తారు. మొదటి రెండూ ఉన్నా కూడా కంటి నిండా నిద్రలేని జనాభా మన అనుభవంలో చాలా మందే.
సంతోషంగా జీవితం గడుపుతూ కంటి నిండా నిద్ర పోతున్న జనం ఏం దేశంలో ఉన్నారో తెలుసా? పిన్లాండ్ లో నివసించే వారు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమంగా నిద్రపోయే జనమట. కొత్త అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత ఆనందరకర దేశం ఫిన్లాండ్. ఇక్కడ నివసిస్తున్న వారు ప్రతి రాత్రి ఎనిమిది గంటల పాటు గాఢనిద్ర పోతున్నారని అధ్యయనకారులు వివరాలు వెల్లడి చేశారు. ఇక వీరి తర్వాత స్థానం ఫ్రెంచి వారిది. ఫ్రెంచి వారు దాదాపుగా 7 గంటల 45 నిమిషాల పాటు ప్రతి రాత్రి సౌండ్ స్లీప్ లో ఉంటున్నారట. ఇక మూడో స్థానం ఆగ్రరాజ్యం అమెరికా సొంతం చేసుకుంది. వీరు దాదాపు 6 గంటల 51 నిమిషాల పాటు నిద్రను ఏలేస్తున్నారట.
ఈ అధ్యయనం కోసం యూకే, కొరియా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 11 దేశాల్లోని 30,082 మంది స్లీప్ ప్యాటర్న్ ను గమనించారట. ఎంపిక చేసుకున్న వ్యక్తుల నిద్రా విధానాలను 2014 నుంచి 2017 వరకు స్మార్ట్ వాచీలు, సర్వేల వివరాలను ఉపయోగించి పర్యవేక్షించారట. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురించిన ఫలితాలు సగటున అర్థరాత్రి నిద్రకు ఉపక్రమించి ఉదయం 7.42 కి మేల్కొంటున్నట్టు గమనించారట. అయితే నిజంగా నిద్రలో గడిపే సమయం విషయంలో దేశాల మధ్య అంతరం ఉందని వారు వివరిస్తున్నారు. ఫిన్లాండ్ కు చెందిన వారు మొత్తం భూమండలంలో ఉల్లాసంగా గడుపుతున్న జనాభాగా ఇది వరకే అధ్యయనకారులు రుజువు చేశారు. రాత్రి 11.43 నిమిషాల నుంచి మరుసటి ఉదయం 7.43 వరకు ఎనిమిది గంట ఒకనిమిషం పాటు సగటున నిద్రపోయి అగ్రస్థానంలో నిలిచారు.
ఇక రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ప్రజానీకం అర్థరాత్రి 12.06 నుంచి మరుసటి ఉదయం 7.53 వరకు దాదాపు 7 గంటల 45 నిమిషాల పాటు నిద్రలో గడిపుతున్నారు. యూకే వారు రాత్రి 11.52 నుంచి ఉదయం 7.38 నిమిషాల వరకు నిద్రపోతూ ఒకేఒక నిమిషం తేడాతో మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వీడన్, జర్మనీ, స్విట్జర్లాండ్, కెనెడా, ఆస్ట్రియా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలన్నీ కూడా నిద్ర విషయంలో ఎక్కడో మధ్యలో ఉన్నాయి. జపాన్ వాసులు సగుటున 6 గంటల 51 నిమిషాలు మాత్రమే నిద్రకు కేటాయించగలుగుతున్నారట.
ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లోని వారు చాలా తక్కువ మొత్తంలో నిద్రపోతున్నట్టు కనిపించారని కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నోకియా బెల్ ల్యాబ్స్ కి చెందిన ఎక్స్ పర్ట్స్ నిర్ధారిస్తున్నారు. ఇందుకు వారికి ఎక్కువ సమయం పాటు పనిలో గడపాల్సి రావడం, కఠినమైన షెడ్యూల్స్ అమలులో ఉండడం, లేదా వినోదానికి, టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉండడం వంటి అంశాలు కారణం కావచ్చని అంటున్నారు. ఈ అధ్యయనంలో క్రమం తప్పని వ్యాయామ షెడ్యూల్ కలిగిన వారు రోజులో ఎక్కువ సమయం పాటు కాలినడకలో గడిపేవారు మంచి నిద్ర నాణ్యత కలిగి ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. అంటే కాలి నడక ఎక్కువగా ఉన్న వారు, తరచుగా వ్యాయామం చేసే వారు రాత్రి సమయం మేల్కొని ఉండేది తక్కువ నిద్రపోయేది ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అందుకే, నిదురపోరా తమ్ముడా.. అని సినిమా పాటల జోలలా.. ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత సుఖ నిద్రకు సమయం కేటాయించుకుంటే ఆరోగ్యంతోపాటు, చక్కని జీవనశైలీ అలవడుతోంది.
హాయిగా నిద్రపోయే మొదటి పది దేశాలు
ఫిన్లాండ్ – 8.01 గంటలు, ఫ్రాన్స్ – 7.45 గంటలు, యూకే – 7.44 గంటలు, స్వీడన్ – 7.41 గంటలు, జెర్మని – 7.39 గంటలు, స్వీడన్ – 7. 39 గంటలు, కెనడా – 7. 38 గంటలు, ఆస్ట్రియా – 7.35 గంటలు, యూఎస్ఏ – 7.34 గంటలు, స్పెయిన్ – 7.28 గంటలు, జపాన్ – 6.51 గంటలు
మత్తు వదిలరా నిద్దుర మత్తు వదలరా!
నిజానికి హాయిగా నిద్రపోవడం కూడా ఒక వరమే. కొన్ని సందర్భాల్లో ఆ నిద్ర చాలా మందికి శాపంగానూ మారొచ్చు. దేనికైనా జీవితంలో సమతుల్యత అవసరం. కోట్లకు పడగలెత్తిన వాళ్ళలోనూ నిద్రకరవైన వాళ్ళు ఉంటారు. కలోగంజో తాగే సగటు పేదవాడేమో అందుకు భిన్నంగా సమయానికి తగ్గట్టుగా హాయిగా నిద్రపోగలడు. ఆరోగ్య రీత్యా నిద్రకు నోచుకోని వాళ్ళూ ఉంటారు. ఆర్ధిక, మానసిక కృంగదీతలతో నిద్రకు దూరమైనవాళ్ళూ ఉంటారు.
