Let's talk: editor@tmv.in
హామీల అమలు సున్నా.. ప్రచారంలో మాత్రం అగ్రస్థానం: కూటమి సర్కార్‌పై జగన్‌ ధ్వజం

హామీల అమలు సున్నా.. ప్రచారంలో మాత్రం అగ్రస్థానం: కూటమి సర్కార్‌పై జగన్‌ ధ్వజం

Panthagani Anusha
20 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర బడ్జెట్ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా వంచించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. "మోసానికి షర్టు, ప్యాంటు వేస్తే అది చంద్రబాబు.. అదే అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి ఆయన మాటలు" అంటూ ఎద్దేవా చేశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బడ్జెట్ గణాంకాలను విశ్లేషిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

అంకెల గారడీ.. ఆదాయంలో అట్టడుగున

చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రస్తుత బడ్జెట్ అంతా అభూతకల్పనలతో నిండి ఉందని జగన్ విమర్శించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటుపై బాబు చెబుతున్న లెక్కలకు, వాస్తవాలకు పొంతన లేదని ఆరోపించారు. రాష్ట్ర సొంత ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 22వ స్థానానికి పడిపోయిందని కాగ్ నివేదికలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే రాష్ట్ర వృద్ధి ఎక్కువగా ఉందని బాబు ‘డబ్బా’ కొట్టుకుంటున్నారని కానీ క్షేత్రస్థాయిలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆదాయమంతా ఇసుక, మద్యం, మట్టి మాఫియా జేబుల్లోకి వెళ్తోందని, అందుకే ఖజానా వెలవెలబోతోందని ఆరోపించారు.

హామీల బాండ్లు.. అమల్లో సున్నా

ఎన్నికల సమయంలో ‘బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ’ అంటూ ఇంటింటికీ బాండ్లు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చాక వాటిని డస్ట్‌బిన్‌లో వేశారని జగన్ మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారని విమర్శించారు. రైతులకు ఏటా రూ.20 వేల ‘అన్నదాత సుఖీభవ’ ఊసే లేదని వ్యవసాయ రంగాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఏమైందని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా ఉద్యోగులకు జీతాలు పెరగలేదని ఐఆర్, పీఆర్సీ ప్రస్తావనే లేదని సుమారు రూ.35 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టి ఉద్యోగులను అగాధంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

విమానాల్లో జల్సాలు.. రికార్డు స్థాయిలో అప్పులు

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, పాలకులు మాత్రం విలాసాలకు అలవాటు పడ్డారని జగన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ఒక విమానం, కొడుకు లోకేష్‌కి ఒక హెలికాప్టర్, పవన్ కళ్యాణ్‌కు మరో విమానం.. అంతా గాల్లోనే తిరుగుతున్నారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కూడా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లే సంస్కృతి వీరిది" అంటూ విమర్శించారు. మరోవైపు అప్పుల విషయంలో చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తమ హయాంలో అప్పుల వృద్ధి రేటు 13.09 శాతం ఉంటే బాబు హయాంలో అది 22 శాతానికి పైగా ఉందని ఆధారాలతో సహా వివరించారు. 20 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3,17,448 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.

తిరుమల పవిత్రతపై అసత్యాలు

తిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తిరుమలను ఏడు కొండలుగా నోటిఫై చేసింది, అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జీవోలు ఇచ్చింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. నాడు ఆ జీవోలను వ్యతిరేకించిన చంద్రబాబు నేడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో హెరిటేజ్ ప్రయోజనాల కోసమే ఇందాపూర్ డెయిరీని తెరపైకి తెచ్చారని, కిలో నెయ్యి ధరను రూ.658 కి పెంచి భక్తుల సొమ్మును దోచుకుంటున్నారని ఆధారాలతో సహా ఎండగట్టారు. చంద్రబాబుకు అబ్బదం చెప్పడం ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని జగన్ ఈ అంకెల గారడీని, మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.