Let's talk: editor@tmv.in
హాదీ హత్య కేసు నిందితులు ఎక్కడ? భారత్‌లోనా? బంగ్లాదేశ్‌లోనా

హాదీ హత్య కేసు నిందితులు ఎక్కడ? భారత్‌లోనా? బంగ్లాదేశ్‌లోనా

Shaik Mohammad Shaffee
29 డిసెంబర్, 2025

బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించిన యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు భారతదేశానికి పారిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. నిందితులు ఫైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్.. మేఘాలయ రాష్ట్రం ద్వారా ఇండియాలోకి ప్రవేశించారని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు.

అసలేం జరిగింది?

32 ఏళ్ల హాదీ 'ఇంక్విలాబ్ మంచో' అనే సంస్థకు ప్రతినిధిగా ఉండేవారు. గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి దారితీసిన నిరసనల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది డిసెంబర్ 12న ఢాకాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ని సింగపూర్‌కు తరలించినప్పటికీ, పరిస్థితి విషమించి డిసెంబర్ 18న ఆయన కన్నుమూశారు.

బంగ్లా పోలీసుల మాట మార్పు?

నిందితుల ఆచూకీపై బంగ్లా పోలీసులు వరుసగా మాట మారుస్తున్నారు. మొదట డిసెంబర్ 15న “నిందితులు భారత్‌లో ఉన్నారనడానికి మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు” అని చెప్పిన పోలీసులు, ఇప్పుడు కొత్త కథనాన్ని తెరపైకి తెచ్చారు. నిందితులు హలువాఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయలోకి అడుగుపెట్టారని, అక్కడ వారికి స్థానిక వ్యక్తులు సహాయం చేశారని చెబుతున్నారు. వారికి సహకరించిన ఇద్దరిని భారత పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూడా బంగ్లా అధికారులు పేర్కొంటున్నారు.

భారత అధికారుల తీవ్ర ఖండన

బంగ్లాదేశ్ చేస్తున్న ఈ ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం, మేఘాలయ పోలీసులు తీవ్రంగా ఖండించారు. నిందితులు భారత్‌లోకి ప్రవేశించినట్లు గానీ, వారికి సహాయం చేసిన వారిని తాము అరెస్ట్ చేసినట్లు గానీ ఎక్కడా ఎలాంటి రికార్డులు లేవని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా బంగ్లా పోలీసులు చేస్తున్న ఈ ప్రచారాన్ని వారు తోసిపుచ్చారు.

రూ. 218 కోట్ల చెక్కు.. పక్కా స్కెచ్!

ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా పథకం ప్రకారం చేశారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేసి, వారు వాడిన పిస్టల్స్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సుమారు 218 కోట్ల రూపాయల విలువైన సంతకం చేసిన చెక్కును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

రాజకీయ కోణంలో దర్యాప్తు

ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో హాదీ పోటీ చేయాల్సి ఉండటంతో, ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యకు అసలు సూత్రధారులు ఎవరు అనే విషయాన్ని బయటపెట్టడానికి భద్రతా దళాలు శ్రమిస్తున్నాయి. మరో 10 రోజుల్లో ఈ కేసులో పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

హాదీ హత్య కేసు నిందితులు ఎక్కడ? భారత్‌లోనా? బంగ్లాదేశ్‌లోనా - Tholi Paluku